సాక్షి, అదిలాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పర్యటనను ఎలాగైనా అడ్డుకుని తీరతామంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు జిల్లాల ఎస్పీల నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ సవాల్ చేసింది. దీంతో.. ఆ పార్టీ శ్రేణుల్ని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి జోగు రామన్నను అర్ధరాత్రి హౌజ్ అరెస్ట చేశారు. బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా అటు వైపు రానివ్వకుండా ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు.
సీఎం రేవంత్ తన పర్యటనలో భాగంగా.. అదిలాబాద్ నియోజకవర్గంలో కొరట చనక మ్యారేజ్ పంప్ హౌస్‌ను ప్రారంభిస్తారు. ఆపై నిర్మల్ జిల్లా మామడ మండలంలో సదర్ మార్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం.. నిర్మల్ టౌన్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.


