
సాక్షి, మెదక్/హైదరాబాద్ : మహమ్మారి కరోనా వైరస్ భయం మనుషుల్లోని మానవత్వాన్ని చంపేసింది. కాపాడండి అంటూ చేతులెత్తి మొక్కినా ఎవరూ పట్టించుకోలేదు.. సాయం చేయడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. దీంతో సకాలంలో చికిత్స అందక ఓ నిండు ప్రాణం గాల్లో కలిసి పోయింది. ఈ హృదయవిదారకర ఘటన మెదక్ జిల్లా చేగుంటలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నేరేడ్‌మెట్‌కు చెందిన ఆర్ శ్రీనివాసబాబు అనే వ్యక్తి బస్సులో వెళుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ప్రాథమిక చికిత్స కోసం మార్గమధ్యలో చేగుంటలో దిగాడు.
కొద్ది దూరం నడిచాక ఓపిక లేక రోడ్డు పక్కన పడిపోయాడు. అనంతరం తనను కాపాడాలంటూ అక్కడున్న వారిని చేతులెత్తి మొక్కుతూ వేడుకున్నాడు. అత్యవరస చికిత్స అవసరమని త్వరగా ఆస్పత్రిలో చేర్పించాలని బతిమిలాడుకున్నాడు. కానీ కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. చివరికి శ్రీనివాస బాబు రోడ్డు పక్కనే కన్నుమూశాడు. విషయం తెలసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.