అనంతసాగర్ హత్య కేసులో నిందితుడి అరెస్టు
చేగుంట(మెదక్ జిల్లా): కేవలం 22 రూపాయల పాత బాకీ విషయంలో గొడవపడి, తోటి కార్మికుడిని హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ తెలిపారు. శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు.
మెదక్ జిల్లా అనంతసాగర్ శివారులోని సప్తగిరి కెమికల్ పరిశ్రమలో పనిచేసే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిరాజ్ (30), అదే రాష్ట్రానికి చెందిన మహేశ్‌కుమార్‌ధర్మ ఒకే గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 15న పండుగ రోజు మద్యం సేవించేందుకు ఇద్దరు స్నేహితులు బయటకు వెళ్లారు. గ్రామశివారులో మద్యం తాగుతూ సిరాజ్ తనకు బాకీ ఉన్న రూ.22 విషయంలో మహేశ్‌కుమార్ గొడవ పెట్టుకున్నాడు.
మాటామాటా పెరగడంతో మహేశ్, సిరాజ్ తలను చెట్టుకు బాది, అనంతరం రాయితో తలపై గాయపరిచాడు. దీంతో సిరాజ్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మహేశ్‌కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మాసాయిపేట శివారులో నిందితుడు మహేశ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్యకు దారితీసిన వివరాలు తెలిపాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.


