అందరికీ మల్కాజిగురి | malkajgiri lok sabha constituency | Sakshi
Sakshi News home page

అందరికీ మల్కాజిగురి

Mar 24 2014 12:07 AM | Updated on Mar 29 2019 9:18 PM

అందరికీ మల్కాజిగురి - Sakshi

అందరికీ మల్కాజిగురి

నగరంలో వెరీవెరీస్పెషల్ ఎవరంటే.. ఠక్కున గుర్తుకొచ్చేది క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణే. ప్రస్తుత ఎన్నికల్లో ఈ ‘స్పెషల్’ హోదా సాధించింది..

      భలే క్రేజ్
     మల్కాజిగిరిపై సెలబ్రిటీల మోజు
     తామే అభ్యర్థులమంటూ సర్వే, జేపీ, నాగేశ్వర్‌ల ప్రకటన
     పోటీకి సిద్ధమవుతున్న పవన్, జయసుధ
     లోక్‌సత్తా, బీజేపీ పొత్తుల సన్నాహాలతో ‘దేశం’లో గందరగోళం
     బలమైన అభ్యర్థిని బరిలో నిలపనున్న వైఎస్సార్ కాంగ్రెస్

 
సాక్షి, సిటీబ్యూరో ప్రతినిధి : నగరంలో వెరీవెరీస్పెషల్ ఎవరంటే.. ఠక్కున గుర్తుకొచ్చేది క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణే. ప్రస్తుత ఎన్నికల్లో ఈ ‘స్పెషల్’ హోదా సాధించింది.. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం. అత్యధిక సెలబ్రిటీలందరి కన్నూ దీనిపైనే పడింది. పోటీ పడే అభ్యర్థులందరికీ ఇదో హాట్‌స్పాట్ అయి కూర్చుంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు మహామహులంతా నేనంటే నేనని ముందుకు దూసుకొస్తున్నారు. వివిధ పార్టీల ముందు క్యూ కడుతున్నారు. వెరసి అందరి బరి.. గురి.. మల్కాజిగిరే.
 
మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి హఠాత్తుగా ‘స్టార్’ స్టేటస్ వచ్చేసింది. రాజకీయ నాయకులకు తోడు స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ స్థానం నుంచి పోటీ పడేందుకు సన్నాహాలు చేస్తున్న తీరు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి తానే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణ ఒకవైపు ఢంకా భజాయించి చెబుతుంటే... తెలుగుదేశం పార్టీ మద్దతుతో తానూ బరిలో ఉంటానని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ మరోవైపు ప్రకటించారు.

ఆమ్‌ఆద్మీతో పాటు ఇతర సంస్థల మద్దతుతో తాను రంగంలో ఉంటానని ఎమ్మెల్సీ నాగేశ్వర్ కూడా తాజాగా మరో ప్రకటన చేశారు. వీరు కాకుండా కాలం కలిసి వస్తే పార్లమెంటుకు వెళ్లే యోచనలో ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, నటి జయసుధ దృష్టీ దీనిపైనే ఉంది. ఇక్కడి నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆమె గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పార్టీల పొత్తుల చర్చలు కొలిక్కి రాకముందే ఎవరికి వారే ఇలా అభ్యర్థిత్వాలను ప్రకటించుకోవటం.. మిగిలిన పార్టీల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్‌రెడ్డిలతో పాటు ఇటీవలే పార్టీలో చేరిన చామకూర మల్లారెడ్డిలు ఈ టికెట్‌పై ఆశలు పెట్టుకోగా.. తెలుగుదేశం మద్దతుతో తానే బరిలో ఉంటానని లోక్‌సత్తా అభ్యర్థి జయప్రకాష్ నారాయణ్ ప్రకటించేయడం విశేషం. మరోవైపు టీడీపీ, బీజేపీల మధ్య ఎన్నికల పొత్తు ఉంటే ఈ స్థానాన్ని బీజేపీ కోరుకోవాలని భావిస్తోంది.

ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. బీజేపీకి మద్దతు ప్రకటించిన సినీనటుడు పవన్‌కళ్యాణ్ సైతం తాను తెలంగాణా నుంచి పోటీ చేస్తే మల్కాజిగిరి స్థానాన్నే ఎంచుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో భారీ స్థాయిలో అభిమానులు, ఓటింగ్ శాతం కలిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. టీఆర్‌ఎస్ ఇంకా ఈ స్థానంపై దృష్టి సారించలేదు.
 
అందరికీ మక్కువ ఎందుకంటే..
 
దేశంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన నియోకజవర్గాల్లో మల్కాజిగిరి ఒకటి. ఈ నియోకజవర్గంలో ఇప్పటికే సుమారు ముప్పై లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. ఈ లోక్‌సభ పరిధిలో ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, కంటోన్మెంట్, మేడ్చల్ శాసనసభ స్థానాలున్నాయి. ఇక్కడ విద్యావంతులకు తోడు దేశంలోని వివిధ రాష్ట్రాలు, రాష్ట్రంలోని సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన జనం పెద్దసంఖ్యలో ఉన్నారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల జనాబా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. 70 శాతం జనం మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల వారే కావటం విశేషం. వీరంతా ఏ పార్టీకైనా అంశాల వారీగా మద్దతు తెలిపే పరిస్థితి ఉండటంతో ఆయా పార్టీలు, నాయకులు ఈ స్థానాన్ని ఎంచుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా.
 
మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సర్వేనే
 
మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సర్వే సత్యనారాయణేనని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ స్పష్టం చేశారు. మల్కాజిగిరి స్థానం కోసం తాను పార్టీకి దరఖాస్తు చేసుకొలేదని, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నుంచే తిరిగి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. కేంద్ర మంత్రి సర్వే  నాయకత్వంలోనే పనిచేస్తానని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement