నియంత్రిత సాగుతో దేశానికి ఆదర్శం 

KTR Says Regulated Cultivation Is Ideal For Country In Hyderabad - Sakshi

రైతుబంధు ఎగ్గొట్టే ఆలోచన లేదు:  కేటీఆర్‌

ఉపాధి హామీలో కల్లాలు, కాల్వల నిర్మాణం చేపట్టాలని ఆదేశం   

సాక్షి, సిరిసిల్ల: రాష్ట్రంలో రైతాంగం నియంత్రిత సాగు విధానాలను అనుసరిస్తే దేశానికి ఆదర్శంగా ఉంటామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పలు వంతెనలు, ఇతర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో అ«ధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, ఏ ఒక్క రైతుకూ ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. వ్యవసాయా«ధికారులు, రైతుబంధు సమితి సభ్యులు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి నియంత్రిత సాగు విధానాన్ని అనుసరించే విధంగా చూడాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా గతంలో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు కేటాయించామని, ప్రస్తుతం రూ.14 వేల కోట్లు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు. రైతువారీ వివరాలను అధికారులు సేకరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పంట కల్లాలు, సాగునీటి కాల్వల నిర్మాణం చేపట్టాలని కేటీఆర్‌ సూచించారు. రంగనాయక సాగర్‌ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్‌ మండలానికి సాగునీరు అందనుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. రైతు సంక్షేమం విషయమై ఎలాంటి పరిస్థితుల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. డిసెంబరు నాటికి మధ్యమానేరు నుంచి ఎగువ మానేరులోకి 9వ ప్యాకేజీ ద్వారా సాగు నీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల మధ్య ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 210 ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉండే విధంగా స్థలాన్ని సేకరించాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top