‘అర్హులందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు’

KTR Meeting In Rajanna Sircilla District - Sakshi

రాజన్నసిరిసిల్ల: రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ. 200 పింఛన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1000 లకు పెంచారని రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీర్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు పింఛన్‌ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని.. ఎన్నికల సందర్భంగా రూ.2 వేలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేశారన్నారు. అదే విధంగా పింఛన్‌ వయస్సును 57 ఏళ్లకు తగ్గించడం జరిగిందని.. తద్వారా 7 నుంచి 8 లక్షల  మందికి లబ్ధి   చేకూరనుందని వెల్లడించారు.

కాగా ఇప్పటి నుంచి లక్షన్నర బీడీ కార్మికులకు నెలకు రూ. 2 వేలు రాబోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం 17 శాతం అభివృద్ధితో ముందుకెళ్తుందన్నారు. దీంతో పాటు పేదల ఇళ్లకు పట్టాలు ఇచ్చి.. లోన్‌ తీసుకునే సదుపాయం కల్పించామన్నారు. మండేపల్లిలో 1,360 ఇళ్లు పూర్తయ్యాయి అంటూ.. త్వరలోనే వాటిని లబ్దిదారులకు అందిస్తామన్నారు. అర్హులందరికి రెండు పడక గదుల గృహాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తన మాట నమ్మకుంటే.... ‘నేనే మీకు ఓ బస్సు ఏర్పాటు చేస్తా. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను చూడండి’ అని అన్నారు. ఇళ్ల కోసం ఏ ఒక్కరు రూ.1 కూడా ఎవరికి ఇవ్వవద్దని.. పారదర్శకంగా వేదిక ఏర్పాటు చేసి మీ కళ్ల ముందే లాటరీ తీసి అందిస్తామన్నారు.

డబుల్ బెడ్ రూం గృహాల మంజూరుకు ఎలాంటి పైరవీలు ఉండవని అన్నారు. ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కాంగ్రెస్‌ హయంలోని ఎనిమిది ఇందిరమ్మ ఇళ్లకు సమానమని పేర్కొన్నారు.  జిల్లా వ్యాప్తంగా పూర్తి సమగ్ర సమాచారం తమ వద్ద ఉందని.. పేదలను గుర్తించి మరీ ఇళ్లను కల్పిస్తామన్నారు.  రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం పేద విద్యార్థులకు ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు.  సుమారు 3 లక్షల మంది విద్యార్థులకు కేసీఆర్‌ ప్రభుత్వం చదువుకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దీంతో పాటు వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ. 65 కోట్లను చెక్కుల రూపంలో త్వరలోనే అందిస్తామన్నారు. సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి మీ కళ్ల ముందు కనిపిస్తుందా.. లేదా.. మీరే చెప్పాలని కేటీఆర్‌ ఈ సందర్భంగా స్థానికులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇరు జిల్లాలు అసూయ పడేట్లు సిరిసిల్ల తయారైందని చెప్పారు. బతుకమ్మ చీరాల బకాయిలను తాను అందిస్తానని హామీ ఇచ్చారు. అపెరల్ పార్కుల్లో బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తానని పేర్కొన్నారు.  తనకు దేశంలో గుర్తింపు ఉందంటే అది సిరిసిల్లా ప్రజలు చూపిన ఆశీర్వాదంమే అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top