ట్యాంపరింగ్‌ చేసే గెలిచావా బాబూ?

Kishan Reddy Fires On Chandrababu Naidu - Sakshi

అదే నిజమైతే రాజీనామా చెయ్‌!

ఈవీఎంలను అనుమానించడంపై కిషన్‌ రెడ్డి డిమాండ్‌

తనపై కాంగ్రెస్‌ నేతలు చేసిన అసత్య ప్రచారంపై డీజీపీకి ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు ట్యాంపరింగ్‌ చేసే అధికారంలోకి వచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. అదే నిజమైతే కాంగ్రెస్‌తో కలిసి ఆరోపణలు చేస్తున్న బాబు ఒక్క క్షణం కూడా సీఎం పదవిలో ఉండటానికి వీల్లేదని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, 11 మందిని కాల్చి చంపించినట్లు చేసిన సయ్యద్‌ షుజా, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ చేసిన ఆరోపణలపై బుధవారం కిషన్‌రెడ్డి స్పందించారు.

తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్, సయ్యద్‌ షుజాలపై డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలిసి డీజీపీని కలిశారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్‌ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కపిల్‌ సిబల్‌ సమక్షంలోనే షుజా మాట్లాడారని.. ఈవీఎంలలో లోపాలుంటే రుజువు చేయాలని సవాల్‌ చేశారు. 

అక్కడ కూడా ట్యాంపరింగేనా?: దత్తాత్రేయ
ఈవీఎంలపై కాంగ్రెస్‌ ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికైనా మానుకోవాలన్నారు. ప్రజలంతా మోడీవైపే చూస్తున్నారన్నారు. 10% రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో ఆ అంశం లేకపోవడం భాధాకారమన్నారు. ఏపీలో చంద్రబాబు కాపులకు ఇస్తానన్న 5% రిజర్వేషన్లు బీజేపీ పుణ్యమేనన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top