అవిశ్రాంత పోరాటయోధుడు జాదవ్‌

keshavarao jadhav Commemoration day - Sakshi

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ అవిశ్రాంత పోరాటయోధుడని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ ఆధ్వ ర్యంలో హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జాదవ్‌ సంస్మరణసభలో నాయిని మాట్లాడుతూ కేశవరావు జాదవ్‌ నిజమైన సోషలిస్టు నేత అని అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు 18 నెలలపాటు జైలు పాలయ్యారని, నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయన నైజమన్నారు. జాదవ్‌ పేరిట ఫౌండేషన్‌ ఏర్పాటు కోసం ప్రయత్నించాలని, అందుకు తనవంతు సహాయ సహకారం అందిస్తానని, నగరంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రాజ్యసభసభ్యుడు కె. కేశవరావు మాట్లాడుతూ నక్సలైట్ల సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని కోరుకోవడంతోపాటు ప్రభుత్వంతో చర్చలక్రమంలో ముందు నిలిచారని గుర్తుచేశారు.

ఆయన మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో కేశవరావు జాదవ్‌ పాత్ర ఎనలేనిదని అన్నారు. సోషలిజం ఎప్పటికీ అంతం కాదని, నిర్బంధం సమస్యలకు పరిష్కారం కాదని చెబుతుండేవారన్నారు. కార్యక్రమం లో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, రచయిత వసంతా కన్నాభిరాన్, విరసం సభ్యురాలు రత్నమాల, నదీజలాల కార్పొరేషన్‌ చైర్మన్‌ వి.ప్రకాశ్, ఫోరం ఫర్‌ బెటర్‌ హైదరాబాద్‌ వ్యవస్థాపకుడు ఎం.వేదకుమార్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్, తెలంగాణ ప్రజాఫ్రంట్‌ నేత చిక్కుడు ప్రభాకర్, ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి, సీనియర్‌ న్యాయవాది జయవింధ్యాల, పీవోడబ్ల్యూ నాయకురాలు వి.సంధ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనురాధ, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, హనుమాండ్లుతోపాటు జాదవ్‌ సతీమణి ఇందిరా, కుమార్తెలు నివేదిత, నీలు, చెల్లెలు, సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top