సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు.. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు భయంకరమైన ఆరోపణలు చేశారంటూ దుయ్యబట్టారు. కోట్లాది హిందువుల మత విశ్వాసాలపై దాడి కాదా? అంటూ నిలదీశారు.
‘‘వాస్తవాలు గమనించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎఫ్‌ఐఆర్ దాఖలు కాకుండా.. కేసు పెట్టకుండా.. విచారణ జరగకుండా సీఎం ఎలా తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు సీఎం స్థాయిలో ఉండి ఆరోపణలు చేస్తారు. సిట్ విచారణలో జంతు కొవ్వులేదని తేలింది. జంతు కొవ్వు కలిసినట్టు ఆధారాలు లేవు. తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తున్నారు’’ అని నాగేశ్వర్ మండిపడ్డారు.
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టం చేయడంతో చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్’, గుజరాత్‌లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే.



