సాక్షి,తాడేపల్లి: రాజకీయ దురుద్ధేశంతోనే శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం చేశారని కూటమి నేతలపై వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు మహాపాపం చేశారు. కోట్లాది మంది భక్తుల్ని షాక్‌కి గురి చేసిన పాపం చంద్రబాబుదే. ప్రజాక్షేత్రంలో చంద్రబాబును బోనులో నిలబెట్టాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు క్షమాపణ చెప్పకపోగా మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందని తప్పుడు ఆరోపణలు చేశారు. కానీ రెండు జాతీయ ల్యాబ్ రిపోర్టులు సైతం చంద్రబాబు ఆరోపణలు తప్పని తేల్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం విపరీతంగా తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేశారు. అయోధ్యకు కల్తీ లడ్డూలు పంపించారని విషప్రచారం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి మాపై నిందలా అని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.


