సాక్షి, విజయవాడ: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అందించాలని శుక్రవారం అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తతలకు దారి తీసింది. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కొందరు యువకులు మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయానికి ముట్టడించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించారు. బారికేడ్లను అడ్డు వేయగా.. వాటిని తోసుకుని కొందరు యువకులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ధర్నా చౌక్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకనైనా అమలు చేయాలంటూ ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.


