సాక్షి, తూర్పుగోదావరి: తిరుమల విషయంలో కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇంతా జరుగుతున్నా సనాతని పవన్ ఎక్కడికి వెళ్లిపోయారు. అప్పుడు ఊగిపోయిన పవన్.. ఇప్పుడు కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు.
మాజీ ఎంపీ మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో ఏ విధమైన జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని చంద్రబాబు ఏ విధంగా నిర్ధారించారో చెప్పాలి. గతంలో జంతువుల కొవ్వు కలిసిందని దారుణంగా మాట్లాడారు. రెండు రిపోర్టుల్లో యానిమల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టమైన నివేదికలు వచ్చాయి. కోట్లాది హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీశారు. యానిమల్ ఫ్యాట్ అనే పదం ఎందుకు ఉపయోగించారు?. చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిశాయని లోకేష్ మాట్లాడారు. ఇంత జరుగుతుంటే సనాతని పవన్ ఎక్కడికి పోయారు?.
తిరుపతి వెంకన్న గురించి గానీ, లడ్డు గురించి గానీ ఇలా ఇంకెవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. ఇలా మాట్లాడటానికి, ఆరోపణలు చేయడానికి వీరికెవరు అధికారం ఇచ్చారు?. దేవుని గురించి మాట్లాడేందుకు వీరికేమైనా మినహాయింపు ఉందా?. 2018లో 23 లక్షల కిలోల నెయ్యి ఆర్డర్ 320/- చొప్పున చంద్రబాబు హయాంలో ఆర్డర్ ఇచ్చారు. జైనులను కూడా ఈ వ్యవహారంలో దోషులుగా చేర్చారు. మాంసాహారం అంటేనే జైనులు ఆమడ దూరంలో ఉంటారు.. చీమకు కూడా హాని చేయరు.. అటువంటి వారిని కూడా ఇరికించారు. కొవ్వుతో కలిపి తయారు చేసిన లడ్డులను అయోధ్య కూడా పంపించారని ఇష్టారీతిన పవన్ మాట్లాడేసాడు. ఇటువంటి వ్యక్తులను ఏం చేయాలి?. హైకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని వీరిపై కేసు నమోదు చేయాలి. నిజంగా చంద్రబాబు, పవన్, లోకేష్ తిరుమలలో మెట్లపై ముక్కు నేలకు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను క్షమాపణ కోరాలి.
పవన్ కళ్యాణ్ మాటలు తప్పు కాదా?. హిందూ ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ ఎందుకు ఈ విషయంలో స్పందించడం లేదు?. ఎందుకు చంద్రబాబును కూటమి నుంచి తొలగించడం లేదు. రాజకీయాలకు లొంగిపోతున్నారా?. చంద్రబాబును ఎలా క్షమిస్తున్నారు?. వీరిని వెంకటేశ్వరుడు కచ్చితంగా ఈ జన్మలోనే శిక్షిస్తాడు. భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు చేసిన ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆరోపణలు చేయడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


