జూరాలకు ఏడాదంతా నీళ్లు!

KCR Said Godavari Water Give To Palamuru Project - Sakshi

పాలమూరు ఎత్తిపోతల నుంచి గోదావరి నీరు

చివరి పంటకు, వేసవిలో తాగునీటి అవసరాలకు తీరనున్న ఇక్కట్లు

సాక్షి, గద్వాల: గోదావరి నదీ జలాలను సంగంబండ ద్వారా జూరాల జలాశయానికి అందించాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఏడాదంతా నీటినిల్వ ఉండే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురిసి, అల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు నిండిన తర్వాత రాష్ట్రంలోకి కృష్ణానది వరద వస్తేనే జూరాల ప్రాజెక్టుకు జలకళ వచ్చే పరిస్థితులు ఇన్నాళ్లు ఉండగా.. ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయి. ప్రియదర్శిని జూరా ల ప్రాజెక్టు జలాశయంపై ప్రాజెక్టు ఆయకట్టుతోపాటు, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, గట్టు ఎత్తిపోతల పథకాలకు 64 టీఎంసీల నీళ్లు ఏటా అవసరం ఉంది. జూరాల  ప్రాజెక్టు జలాశయంలో నీటి నిల్వ 9.66 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. ఖరీఫ్‌లో ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా ఆయకట్టుకు నీటిని అందిస్తున్నారు.

రైతులకు తీరనున్న నీటి కష్టాలు 
ఇదిలాఉండగా, కర్ణాటక నుంచి వరద రాకుంటే ఇక్కడి రైతులు తమ పంటకు విరామం ప్రకటించుకోవాల్సింది. జూరాల జలాశయంపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు నీటిని అందించే అవకాశం ఉండదు. గత ఏడాది జూరాలకు ఎగువ నుంచి నీటి లభ్యత లేకపోవడంతో ఒకే పంటకు పరిమితమయ్యారు. వేసవిలో తాగు నీటి అవసరాలకు ఆదుకోవాలని కర్ణాటకను కోరారు. కర్ణాటక ప్రభుత్వం స్పందించి 2 టీఎంసీల నీటిని నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి విడుదల చేసినా ఆ రాష్ట్రం దాటి జూరాలకు చేరింది కేవలం 0.75 టీఎంసీలు మాత్రమే. గత నాలుగు ఏళ్లుగా కర్ణాటకను తాగునీటి కోసం, పంటలను చివరి దశలో కాపాడడం కోసం వేడుకుంటేనే ఉన్నాం. సీఎం నిర్ణయంతో ఇక రైతుల నీటి కష్టాలు తీరనున్నాయి.

గట్టు సామర్థ్యం పెంపునకు నిర్ణయం
రైతుల పంట పొలాలు, తాగునీటి ఇక్కట్లకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే గట్టు ఎత్తిపోతల జలాశయాన్ని 15 టీఎంసీల సామర్థ్యంకు పెంచాలని సీఎం కేసీఆర్‌ గత ఏడాది జూన్‌లో నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. అందుకు అనుగుణంగా సర్వే పూర్తయింది. వచ్చే నెలలో పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కృష్ణానదికి వరద రాని కాలంలోనూ జూరాలకు గోదావరి నదీ జలాలను అందించాలని సంకల్పించామని సీఎం ప్రకటించడంతో జూరాలకు ఏడాంత నీటి లభ్యత ఉండే కాలం రాబోతుంది. గోదావరి నది నీటిని శ్రీశైలం జలాశయంకు మళ్లిస్తారు. శ్రీశైలం జలాశయం నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సంగంబండ జలాశయానికి నీటిని అందిస్తారు. సంగంబండ నుంచి జూరాల జలాశయంకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. గ్రావిటీ ఫ్లో ద్వారానే సంగంబండ నుంచి జూరాల జలాశయంకు నీటిని విడుదల చేసేలా లెవెల్స్‌ ఉన్నాయి. గోదావరి నదిలో నీటి లభ్యత పుష్కలంగా ఉన్నందున కృష్ణానదికి వరద రానప్పుడు ఆదుకోవడం, వేసవిలో జూరాల అవసరాలకు కర్ణాటకను వేడుకునే పరిస్థితి శాశ్వత పరిష్కారం ఇవ్వనున్నారు. జూరాల ప్రాజెక్టుతో పాటు,  నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల పరిధిలోని 6.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టు పరిధిలోని రైతులు ఏటా నీళ్లు వస్తాయో లేదో అనే సంశయాన్ని వీడి పంటల సాగుకు సిద్దమయ్యే రోజులు రానున్నాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top