కేసీఆర్‌ వస్తుండు.. ఆశీర్వదించండి

KCR Campaigning  In Siddipet - Sakshi

సభకు స్వచ్ఛందంగా తరలిరండి

ఏర్పాట్లపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

ఈ నెల 20న సిద్దిపేట పత్తి మార్కెట్‌ యార్డు పరిసరాల్లో సభ

సిద్దిపేటజోన్‌:  అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని, మరోసారి ఆయన నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఆశీర్వదించాలని ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను మళ్లీ ఆశీర్వదించాలని ప్రజలను కోరి సభ విజయవంతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని దిశానిర్ధేశనం చేశారు.

 సిద్దిపేట పత్తి మార్కెట్‌ యార్డు పరిసరాల్లో ఈ నెల 20న జరగనున్న సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల సీఎం ప్రచార సభ జయప్రదానికి  నాయకులు, కార్యకర్తలే వారథులని, ప్రజలు స్వచ్ఛందంగా  సభను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చేలా చూడాలని కోరారు. ఆదివారం పత్తి మార్కెట్‌ యార్డు వద్ద సీఎం సభ ఏర్పాట్లను దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డితో కలిసి పరిశీలించారు.

సీఎం సభ వేదిక,  ప్రజల గ్యాలరీలు, హెలిప్యాడ్, పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలించి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్‌ కౌన్సిలర్లతో సభ ఏర్పాట్లు, సీఎం సభ విజయవంతంపై సమీక్షించారు. పట్టణంలోని 34 వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ర్యాలీ రూపంలో పాదయాత్రగా స్వచ్ఛందంగా సభా స్థలికి తరలివచ్చేలా ఆయా వార్డు కౌన్సిలర్లు వారథులుగా నిలవాలని సూచించినట్లు సమాచారం.

మరోవైపు నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు సీఎం సభను జయప్రదం చేసేందుకు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ఎవరికి వారే సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో వచ్చేలా చూడాలని సూచించారు.

అనంతరం సభ ఏర్పాట్లు, నియోజవర్గం నుంచి సభకు హాజరయ్యే జన  సమీకరణ, ఇతరాత్ర అంశాలపై హరీశ్‌రావు నాయకులతో సమీక్షించారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, ప్రవీణ్, గుడాల శ్రీకాంత్, తాళ్ళపల్లి సత్యనారాయణ, గురజాడ శ్రీనివాస్, గ్యాదరి రవి, బాసంగారి వెంకట్, శ్రీనివాస్‌యాదవ్,  బూర మల్లేశం, మామిండ్ల ఐలయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు మోహన్‌లాల్, నయ్యర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top