మీ బిడ్డగా చెప్తున్నా..  | KCR "Addressed The Public Blessing Houses. | Sakshi
Sakshi News home page

మీ బిడ్డగా చెప్తున్నా.. 

Nov 29 2018 8:17 AM | Updated on Nov 29 2018 8:17 AM

KCR "Addressed The Public Blessing Houses. - Sakshi

సంగారెడ్డి ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రి హరీశ్‌రావు, సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అం దోలు నియోజకవర్గాలకు సింగూరు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు తెస్తా. హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, నేను సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు రాకుంటే.. ఇంకా ఎప్పటికీ రావు.. మెదక్‌ జిల్లా బిడ్డగా, కేసీఆర్‌గా ఇది నా బాధ్యత.        

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘నేను మీ బిడ్డగా చెప్తున్నా.. పాత మెదక్‌ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాలకు సింగూరు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు తెస్తా. పాత మెదక్‌ జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన సంగారెడ్డి ప్రాంతానికి సింగూరు నుంచే సాగు నీరు రావాలి. హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, నేను సీఎంగా ఉన్నప్పుడు నీళ్లు రాకుంటే.. ఇంకా ఎప్పటికీ రావు.. మెదక్‌ జిల్లా బిడ్డగా, కేసీఆర్‌గా ఇది నా బాధ్యత’ అని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు.

‘సింగూరు నీరు మన జన్మహక్కు. హైదరాబాద్‌కు సింగూరు జలాల తరలింపును నిలిపివేసి, కృష్ణా, గోదావరి నుంచి తెస్తున్నం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది జూన్‌ తర్వాత నీళ్లు వస్తున్నాయి. రాత్రింబగళ్లు కష్టపడుదాం’ అని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం మానవీయ కోణంలో పనిచేస్తోందని, సంపద పెంచి ప్రజలకు పంచుతుండటంతో.. అనూహ్యమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. మేనిఫెస్టోలో లేని 76 పథకాలను అమలు చేయడంతో పాటు, జాతి, మత వివక్ష లేకుండా అందరికీ మేలు చేసే పనిలో టీఆర్‌ఎస్‌ ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

‘ఎన్నికల్లో పార్టీలు, వ్యక్తులు, అభ్యర్థులు గెలవడం ముఖ్యం కాదు.. ప్రజలు గెలిస్తేనే ప్రజల ఎజెండా అమలవుతుంది. ఓటర్లు గందరగోళానికి తావు లేకుండా వివేచనతో ఓటు వేయాలని’ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఓవైపు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్‌ఎస్‌ మరో వైపు ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నాయని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని’  పిలుపునిచ్చారు.  


సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ
‘సంగారెడ్డికి ప్రధానంగా రెండు పనులు కావాలి. సంగారెడ్డిలో వచ్చే టర్మ్‌లో నూటికి నూరుశాతం ఏర్పాటు చేస్తాం. దినదినాభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి పట్టణం చుట్టూ నాలుగులేన్ల రింగు రోడ్డును నిర్మిస్తాం. త్వరలో వచ్చి ఈ పనులకు శంకుస్థాపన చేస్తానని’ కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ‘జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుస్తారని సర్వేలు చెప్తున్నయి. సంగారెడ్డిలో గతంలో అణువణువు తిరిగిన అనుభవం నాకు ఉంది. క్రియాశీల కార్యకర్త చింత ప్రభాకర్‌ చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, కౌన్సిలర్, చైర్మన్, ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఈ సందర్భంలో ఇతరత్రా చిల్లర మల్లర విషయాలు మాట్లాడదలచు కోలేదు. ఎవరి వ్యక్తిత్వం ఏంటో, ఎవరి గౌరవం ఏంటో మీకు తెలుసు. ఎవరు ఎలాంటి వాళ్లో మీకు తెలుసు, చెడ్డవాళ్లను గెలిపించుకుంటే మీకు చాలా చెడు జరుగుతుంది.’ అంటూ హెచ్చరించారు.

‘ఆర్‌.సత్యనారాయణ క్రియాశీల కార్యకర్త. ఉద్యమం పొడవునా నాతో పనిచేసిన వ్యక్తి, త్వరలోనే ఆయనకు మరింత గుర్తింపు వస్తుంది. ఉద్యమంలో పనిచేసిన అందరికీ గుర్తింపు ఉంటుంది’ అని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార సభల్లో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్, ఫరీదుద్దీన్, మహ్మద్‌ సలీం, బి.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, పార్టీ అభ్యర్థులు ఎం.భూపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, కె.మాణిక్‌రావు, క్రాంతి కిరణ్‌ పాల్గొన్నారు.

 మోసపోతే గోస పడతం: మంత్రి హరీశ్‌రావు 

నారాయణఖేడ్‌: ఎన్నికల్లో ప్రజలు మోసపోవద్దని గోసపడతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నారాయణఖేడ్‌లోని రహమాన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌ ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. క్వార్టర్‌ సీసాలు, కల్లుపెట్టెలు, నోట్ల కట్టలు చూసి మోసపోవద్దని సూచించారు. కాల్వ నీళ్లు కావాలా, క్వార్టర్‌ సీసాలు కావాలా అని ప్రశ్నించారు. నారాయణఖేడ్‌ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాళేశ్వరం నీటిని తీసుకు వచ్చి సింగూరును నింపుతామని, ఖేడ్, కల్హేర్, పెద్దశంకరంపేట్‌ మండలాలకు కాల్వల ద్వారా, మనూరు, కంగ్టికి ఎత్తిపోతల ద్వారా మొత్తం లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని హరీశ్‌ తెలిపారు.

తండాలు, పల్లెల్లో భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ఖేడ్‌లో 54గిరిజన తండాలు పంచాయతీలుగా మారాయని గుర్తు చేశారు. ఖేడ్‌లో మార్కెట్‌ యార్డును నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో ఇక్కడ సంజీవరెడ్డి రాత్రికి రాత్రి జెండా మార్చాడని, ఆయన జంప్‌ కొడితే ప్రజలు జంప్‌ కొడతారా అని ప్రశ్నించారు. ఆయన ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కాంగ్రెస్‌కు ఏం చూసి ఓట్లు వేయాలని ప్రశ్నించారు. షెట్కార్లు స్వలాభం చూసుకున్నారు తప్ప ఖేడ్‌కు చేసిందేమీలేదన్నారు.

నాలుగేళ్ల క్రితం నారాయణఖేడ్‌ ఎలా ఉందో ప్రస్తుతం ఎలా మారిందో గుండెలమీద చేయివేసుకొని ఓట్లు వేయాలని కోరారు. సమావేశంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సువర్ణ షెట్కార్, జిల్లా రైసస సమన్వయకర్త వెంకట్‌రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు బాపు మల్‌శెట్టి, మోహిద్‌ఖాన్, రామాగౌడ్, రవీందర్‌నాయక్, పార్శెట్టి సంగప్ప, నజీబ్, మూఢ రామకష్ణ, ముజమ్మిల్, నాలగతా అశోక్‌ తోర్నాల్, గుండు మోహన్, రవీందర్‌నాయక్, ప్రభాకర్, శ్రీనివాస్‌గౌడ్, సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement