మహాకూటమి అడ్రస్‌ గల్లంతే

Jupalli Krishnarao Criticize On Congress Leaders Rangareddy - Sakshi

ఆమనగల్లు(రంగారెడ్డి): అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనంలో మహాకూటమి అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమని ఆపద్ధర్మ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కడ్తాల్‌ మండలం చరికొండ, ముద్విన్‌ గ్రామాల్లో బుధవారం టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ఎన్నికల శంఖారావంలో మంత్రి పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో పార్టీ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా జూపల్లి కృష్ణారావు ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతుండడంతో రాష్ట్రం అగ్రగామిగా తయారైందని చెప్పారు.

రాష్ట్రంలోని 23 వేల గ్రామాలకు మిషన్‌ భగీరథ నీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఇచ్చిన హామీ మేరకు కల్వకుర్తికి సాగునీరు అందించాం.. మరో రెండునెలల్లో ఆమనగల్లు, వెల్దండ, మాడ్గుల మండలాలకు సైతం అందజేస్తామని వివరించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా తలకొండపల్లి, ఆమనగల్లు మండలాలకు రెండేళ్లలో సాగునీరు అందుతుందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోర్టు కేసులకు వెళ్లకపోతే ఈ పాటికి సాగునీరు అందేదని తెలిపారు.

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్‌ నాయకులు.. ఆమె ఎందుకు ఇచ్చింది.. ఎవరి ఉద్యమంతో దిగివచ్చిందో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వందకు పైగా స్థానాలు సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ నేడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏర్పాటైన మహాకూటమి గల్లంతవడం ఖాయమని చెప్పారు. మహాకూటమి, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవన్నారు. గతంలో చావు తప్పి కన్ను లొట్టపోయిన విధంగా గెలిచిన వంశీచంద్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో  డిపాజిట్లు దక్కకుం డా చేయాలని ఆయన ప్రజలను కోరారు.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, ఆమనగల్లు సిం గిల్‌విండో చైర్మన్‌ దశరథ్‌నాయక్, కల్వకుర్తి టీఆర్‌ఎస్‌ మాజీ ఇన్‌చార్జి బాలాజీసింగ్, కడ్తాల రైతు సమన్వయ సమిటీ కన్వీనర్‌ జోగు వీరయ్య, మం డల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తులసీరాంనాయ క్, చరికొండ సర్పంచ్‌ లాల్‌కోట నర్సింహాగౌడ్, ఎం పీటీసీ సభ్యురాలు యాదమ్మ, టీఆర్‌ఎస్‌ నాయ కులు పర్వతాలు, మాధవయ్య, చల్లా రాం రెడ్డి, భీష్మాచారి, లక్ష్మయ్య, జంగయ్య, గోపాల్, సాబేర్‌ అలీ, నవీన్, దీప్లా తదితరులు పాల్గొన్నారు. 

మంత్రి ప్రచారానికి ఎమ్మెల్సీ దూరం 

కల్వకుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా కడ్తాల మండలం చరికొండలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన ప్రచారానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి గైర్హాజరయ్యారు. కల్వకుర్తి నుంచి పోటీకి ఆయన ఆసక్తి చూపినప్పటికీ అధిష్టానం  జైపాల్‌యాదవ్‌కు ఖరారు చేయడంతో ఎమ్మెల్సీ అసంతప్తితో ఉన్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జైపాల్‌యాదవ్‌తోపాటు ఇతర నాయకులను బుజ్జగించారు. అయినా, ఎమ్మెల్సీ ప్రచారానికి రాకపోవడంతో చర్చకు దారితీసింది. ఇదే సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో త్వరలో అందరు నాయకులు పాల్గొంటారని చెప్పడం విశేషం. ప్రచారానికి గోలి శ్రీనివాస్‌రెడ్డి, విజితారెడ్డి కూడా డుమ్మాకొటారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top