కమీషన్‌ కాదు.. అంతకుమించి!

Intelligence department in the field for brokers in Eamcet issue - Sakshi

ఎంసెట్‌ కేసులో ‘కార్పొరేట్‌’వ్యవహారం బట్టబయలు 

ర్యాంకుల కక్కుర్తితో కుట్ర పన్నినట్లు సీఐడీ గుర్తింపు 

త్వరలో కార్పొరేట్‌ కాలేజీల కీలక వ్యక్తి అరెస్టు అంటున్న సీఐడీ 

మిగతా బ్రోకర్ల కోసం రంగంలోకి ఇంటెలిజెన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీలో కార్పొరేట్‌ కాలేజీల వ్యవహారం పూర్తిగా బట్టబయలైంది. ఆ కాలేజీ యాజమాన్యాలకు చెందిన ఓ కీలక వ్యక్తి నేతృత్వంలో మొత్తం వ్యవహారం నడిచినట్లు సీఐడీ గుర్తించింది. శ్రీచైతన్య మాజీ డీన్‌ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్‌ శివనారాయణ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా సోమవారం కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వాంగ్మూలాలను సీఐడీ నమోదు చేసింది. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి పూర్తిస్థాయిలో లింకు బయటపడినట్లేనని, అయితే ఆ వివరాలు ఇప్పుడే బయటకు వెల్లడించబోమని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. లీకేజీకి కుట్ర పన్నినట్లు భావిస్తున్న కార్పొరేట్‌ కాలేజీల ప్రముఖుడిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు.  

యాజమాన్యం పేరు బయటపెట్టకుండా.. 
ప్రశ్నపత్రంపై శిక్షణ తీసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది రెండు కార్పొరేట్‌ కాలేజీలకు చెందిన వారు కావడంతో సీఐడీ వ్యూహాత్మకంగా దర్యాప్తు చేస్తోంది. సోమవారం 22 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాంగ్మూలాలు సేకరించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వాసుబాబు చెప్పినట్లు, శివనారాయణ వాదిస్తున్నట్లు.. కేవలం కమీషన్‌ కోసం విద్యార్థులను తరలించలేదని, కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాల ప్రమేయం ఉన్నట్లు తల్లిదండ్రుల నుంచి సేకరించిన ఆధారాల ద్వారా తెలిసిందని సీఐడీ వర్గాలు పేర్కొన్నాయి. యాజమాన్యం పేరు బయటపెట్టకుండా వాసుబాబు, ఏజెంట్‌ శివనారాయణ ద్వారా తతంగం నడిపినట్లు గుర్తించామన్నాయి. అలాగే మాజీ విద్యార్థులు సందీప్, గణేశ్‌ ప్రసాద్‌ లాంటి కొంత మందితో లీకేజీ బ్రోకర్లు, కీలక పాత్రధారులతో కలసి కుట్రకు పాల్పడ్డారని సీఐడీ అనుమానిస్తోంది. ప్రశ్నపత్రం లీకేజీ, క్యాంపుల వ్యవహారం బిహార్‌కు చెందిన కమిలేశ్‌కుమార్‌ సింగ్, కర్ణాటకలోని బెంగళూర్‌కు చెందిన రాజగోపాల్‌రెడ్డి నేతృత్వంలో జరిపినట్లు భావిస్తోంది.  

ఆ వ్యక్తి ద్వారానే.. 
కేసుకు సంబంధించి కార్పొరేట్‌ విద్యాసంస్థకు చెందిన ఓ కీలక వ్యక్తిపై సీఐడీ దృష్టి సారించింది. ఏళ్ల నుంచి మంచి ర్యాంకులు సాధిస్తూ భారీ స్థాయిలో ఫీజులు దండుకున్న సంబంధిత కాలేజీలో ఆ వ్యక్తి కీలక హోదాలో ఉన్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. తన పేరు బయటపెట్టకుండా వాసుబాబు, శివనారాయణలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశాకే సీఐడీ అరెస్టు చేసేలా వ్యవహారం నడిపినట్లు తెలిసిందన్నారు. అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు.. బ్రోకర్లు, సూత్రధారుల ద్వారా ఆ వ్యక్తి బండారం బయటపడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఆ వ్యక్తికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో బృందాలున్నాయని, కేసు ముందు నుంచి ఇప్పటివరకు దొరకని కొంత మంది బ్రోకర్లు దొరికితే మొత్తం వ్యవహారం వెలుగులోకి వస్తుందంటున్నారు. ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చేవరకు అన్ని ప్రాంతాల్లో ఈ కీలక వ్యక్తి తన ఏజెంట్లను అందుబాటులో ఉంచినట్లు భావిస్తున్నారు. దీంతో ప్రశ్నపత్రం తయారు చేసిన వారి వివరాలూ ఇవ్వాలని జేఎన్‌టీయూకు లేఖ రాసే ఆలోచనలో ఉన్నట్లు అధికారుల ద్వారా తెలిసింది. వారి విచారణలో ఆ కీలక వ్యక్తికి సంబం ధించి బలమైన ఆధారాలు బయటపడే అవ కాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

ఆ 16 మంది కోసం ఇంటెలిజెన్స్‌ 
లీకేజీ కేసు 90 శాతం పూర్తయినట్లు భావిస్తున్న సీఐడీ.. ఇందులో కీలక సూత్రధారులు, కుట్రదారుల లింకు తేల్చేందుకు 16 మంది బ్రోకర్ల పాత్ర కీలకమని అనుమానిస్తోంది. వీరి కోసం ఇప్పటివరకు వెతికిన సీఐడీ అధికారులు.. తాజాగా ఇంటెలిజెన్స్‌లోని కౌంటర్‌ వింగ్‌ పోలీసులను రంగంలోకి దింపారు. బ్రోకర్ల కోసం 4 ప్రత్యేక బృందాలతో కలసి బిహార్, కర్ణాటక, ఢిల్లీ, పుణేల్లో వేటసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ సమయంలో మృతిచెందిన కమిలేశ్‌ లింకు, కార్పొరేట్‌ కాలేజీల లింకు వీరిలోని కొంత మంది ద్వారా బయటపడుతుందని, వారికోసం తీవ్రంగా గాలిస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. వారు దొరికితే కేసు, మొత్తం వ్యవహారం ఛేదించినట్లేనని చెప్పారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top