ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం
ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకట ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకారం తెలిపింది.
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శకట ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. రిపబ్లిక్ వేడుకల్లో రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు విజ్ఞప్తి చే సిన దరిమిలా ఈ అనుమతి లభించింది. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం తరు ఫున బోనాల ఉత్సవాల ఇతివృత్తంతో రూపొందించే శకటాన్ని ప్రదర్శించనున్నారు.
క్రిస్మస్ సందర్భంగా గురువారం సెలవు కావడంతో.. రక్షణ మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు శుక్రవారం జరగనున్నట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పడిన తొలి సంవత్సరంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అర్హతను రాష్ట్ర శకటం సాధించడంపై అధికారవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
శకటమిలా..: శకటంలో ముందు భాగంలో డ ప్పు వాయిద్యాలు, ఆ వెంటనే పోతరాజు, వెనుక బోనాలు ఎత్తుకున్న వెళ్తున్న మహిళలు, ఆ తరువాత నాలుక బయటపెట్టి.. చేతిలో చర్మాకోలతో ఉన్న పోతరాజు విగ్రహం.. అమ్మవారి ప్రతిమ, గోల్కొండ కోట ఉండే లా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ వివరించారు. ఢిల్లీ గణతంత్ర వేడు కల్లో తెలంగాణ రాష్ట్ర శకటానికి అనుమతి లభించ డంపై ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.


