భూములు కాపాడుకున్న హౌసింగ్‌ బోర్డు

Housing Board Saves His Lands - Sakshi

రూ.700 కోట్ల విలువైన ఓ భూవివాదంలో బోర్డుకు అనుకూలంగా సుప్రీం తీర్పు

సాక్షి, హైదరాబాద్‌ : దీర్ఘకాలంగా సాగుతున్న భూ వివాదాన్ని పరిష్కరించుకుని దాదాపు రూ.700 కోట్ల విలువైన భూమి చేజారకుండా రాష్ట్ర గృహనిర్మాణ మండలి కాపాడుకుంది. ఈ వివాదానికి సం బంధించి సుప్రీం కోర్టు తాజాగా మండలికి అనుకూలంగా తీర్పు వెలువరించినట్లు గృహ నిర్మాణ శాఖ వెల్లడించింది. కూకట్‌పల్లిలోని 1009 సర్వే నంబర్‌లో 20 ఎకరాల భూమికి సంబంధించి హౌసింగ్‌ బోర్డుకు, అజమున్నీసా బేగం అనే మహిళకు మధ్య గత 20 ఏళ్లుగా వివాదం నడుస్తోంది.

గతంలో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ హౌసింగ్‌ బోర్డుకు అనుకూలంగా తీర్పునివ్వగా ఆమె హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. అక్కడ అజమున్నీసా బేగంకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు ను సవాల్‌ చేస్తూ 2010 లో సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచ్‌ ముందు గృహనిర్మాణ మండలి స్పెష ల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 20 ఎకరాల భూమి హౌసింగ్‌ బోర్డుకే చెందుతుందంటూ హైకోర్టు ఇచ్చి న తీర్పును కొట్టి వేస్తూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు పట్ల గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థంగా వాదనలు వినిపించి న న్యాయ బృందాన్ని వారు అభినందించారు. ఈ తీర్పు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ లాంటి శాఖలు రికార్డుల సవరణ చేయకుండా రూలింగ్‌గా ఉపయోగపడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో వాదనలు వినిపించిన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ పీఎస్‌ నర్సింహ, హౌసింగ్‌ బోర్డు న్యాయవాది టీవీ రత్నం, హౌసింగ్‌ బోర్డు ల్యాండ్‌ అక్విజిషన్‌ ఆఫీసర్‌ కె.వెంకటేశ్వర్లు, న్యాయాధికారిణి పి.అరుణ కుమారి ఇతర అధికారులను  గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ అభినందించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top