
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లకు బహిష్కరణ వంటి తీవ్ర శిక్షను విధించేటప్పుడు వివరణకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. వివరణ ఉంటే శిక్ష తీవ్రత తగ్గి ఉండేదేమోనని వ్యాఖ్యానించింది. ‘‘కోర్టు ధిక్కార కేసుల్లో కూడా నిందితుడికి నోటీసులిచ్చి వివరణ కోరతాం. ఆ సమయంలో తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేసే అవకాశముంటుంది. కానీ కోమటిరెడ్డి, సంపత్‌లకు ఆ అవకాశమే ఇవ్వలేదు’’అని పేర్కొంది. గత వాదనల సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ప్రస్తావించిన తీర్పును ఉటంకిస్తూ, సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆ తీర్పులోనే స్పష్టంగా ఉందని కూడా వ్యాఖ్యానించింది. ఈ మొత్తం వ్యవహారంలో వివరణ ఇవ్వలేదన్న విషయమే తమకు ప్రధానమని పేర్కొంది.
బహిష్కరణను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేసిన 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున వాదనలు ముగిసిన నేపథ్యంలో కోమటిరెడ్డి తదితరుల తరఫున వాదనల నిమిత్తం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. సభా మర్యాదను, గౌరవాన్ని కాపాడినప్పుడు సభ్యుల హక్కులకు విలువ ఉంటుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. విపక్ష సభ్యులను బహిష్కరిస్తుంటే వారికున్న రక్షణలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా, స్పీకర్ అనర్హత వేటు వేస్తే దానిపై సభ్యులు న్యాయసమీక్ష కోరవచ్చన్నారు.
సభా మర్యాదలకు భంగం కలిగించినప్పుడు సభ్యులను బహిష్కరించవచ్చని రాజారాంపాల్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సంపత్‌ను ఎందుకు బహిష్కరించారన్న ధర్మాసనం ప్రశ్నకు సూటిగా బదులివ్వలేదు. ఇయర్ ఫోన్ విసిరినట్లు వీడియో క్లిప్పింగుల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఆ విషయాన్ని బహిష్కరణ తీర్మానంలో ఎక్కడా ప్రస్తావించలేదుగా అని ధర్మాసనం ప్రశ్నించింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల వ్యాజ్యానికి విచారణార్హత లేదని కోమటిరెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల్లో పలువురు ఫిరాయింపుదారులని, వారి అనర్హతపై స్పీకర్ నిర్ణయం రావాల్సి ఉందని అన్నారు. దానితో తమకు సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యాజ్యానికి విచారణార్హత ఉందా, లేదా అన్నదే కావాలని, ఆ దిశగా వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.