సాక్షి, నల్లగొండ: నల్లగొండ ప్రాంత అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం టౌన్‌లోని బొట్టుగూడలో తాను నిర్వహించే కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను నిప్పులా.. నిజాయితీగా బతుకుతున్నా. నల్లగొండ నా గుండెకాయ. అందుకే కొడంగల్‌కు ఎన్ని నిధులు తీసుకెళ్తారో.. తనకూ అన్నే నిధులు ఇవ్వాలని సీఎం రేవత్‌ను కోరా. వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటే పోటీ చేస్తా. లేదంటే ఇదే బొట్టుగూడ స్కూల్‌లో ఓ గది తీసుకుని ఉంటా. ఇక్కడి పిల్లల్లోనే చనిపోయిన నా కొడుకుని చూసుకుంటూ కాలం వెల్లదీస్తా.
గత పదేళ్ల పాలన కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి భారంగా మారింది. ఆ టైంలో కనీసం సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. కార్పొరేట్ స్కూల్స్ పేరుతో దొంగలు దోచుకుంటున్నారు. నేను గనుక విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూల్స్‌ను మూయించేస్తా. వైఎస్ఆర్ హయాంలో నల్లగొండలో ఎంజీ యూనివర్సిటీ నిర్మించా. లా పాటు అనేక నూతన కోర్సులను ఎంజీ యూనివర్శిటీలో తీసుకొచ్చా. నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్డును గిఫ్టుగా గడ్కరీ ఇచ్చారు. నల్లగొండలో ప్రతీ ఇంటికి 24 గంటల నీటిని అందిస్తాం.
చదువంటే ర్యాంకులు మాత్రమే కాదని ఓ ఆలోచన చేశాం. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా డిజిటల్ విద్యను అందిస్తాం. ఇక్కడి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ఇదే స్కూల్ చేర్పించాలి అని కోమటిరెడ్డి కోరారు.


