ప్రభాస్‌ వ్యాజ్యంపై రేపు హైకోర్టు విచారణ | High Court To Hear on Prabhas petition Tomorrow | Sakshi
Sakshi News home page

Dec 20 2018 1:19 PM | Updated on Dec 20 2018 2:06 PM

High Court To Hear on Prabhas petition Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్‌ 5/3లో తనకు చెందిన 2,083 చదరపు అడగుల స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న కేసును ఆయన తరఫు న్యాయవాది గురువారం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ కేసులో రేపు (శుక్రవారం) వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది.

తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్‌ బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు.

వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్‌ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement