ఆదిలాబాద్ జిల్లాను వర్షం ముంచెత్తింది.
గొల్లవాగు ప్రధాన కాలువకు గండి
నీటి మునిగిన వంద ఇళ్లు.. ఉప్పొంగిన సుద్దాల వాగు
కొట్టుకుపోయిన విద్యుత్ మోటార్లు
శ్రీరాంపూర్ ఓసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
సగటు వర్షపాతం 14.1 మిల్లీమీటర్లుగా నమోదు
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లాను వర్షం ముంచెత్తింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు భారీ వర్షంకురిసింది. తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, చెన్నూర్, ఆసిఫాబాద్ డివిజన్‌లో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. ఖరీఫ్ సీజన్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవడం.. రైతులు పంట వేయకపోవడంతో పంట నష్టమేమీ జరగలేదు. కానీ పలు చోట్ల కురిసిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. జైపూర్ మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గొల్లవాగు ప్రాజెక్ట్ ప్రధాన కాల్వకు గండి పడింది. దీంతో భీమారం గ్రామాలోని బీసీ కాలనీలో వంద ఇళ్లు నీట మునిగాయి. రూ.15లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. నిలువ నీడ లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నీట మునిగిన ఇళ్లను ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు సందర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చెన్నూరు మండలంలో కురిసిన భారీ వర్షానికి సుద్దాల వాగు ఉప్పొంగింది. వాగులో రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ మోటర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయూరుు. దీంతో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. మరోపక్క.. మంచిర్యాల రెవెన్యూ డివిజన్‌లో కురిసిన భారీ వర్షానికి ఈ ప్రాంత పరిధిలోని శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్‌లో సింగరేణి అధికారులు బొగ్గు ఉత్పత్తిని నిలిపేశారు. 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో గురువారం రాత్రి భారీ వర్షం కురవడంతో కైరిగూడ, డొర్లి-1, డొర్లి-2 ఓపెన్‌కాస్టుల్లో మూడు గంటల పాటు బొగ్గు ఉత్పత్తి నిలిపేశారు. తర్వాత ఉత్పత్తి ప్రారంభించారు.
మంచిర్యాల డివిజన్లోనే అత్యధికం..
గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 14.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల పరిధిలోని జైపూర్ మండలంలో అత్యధికంగా 187.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాలలో 42.4 మిల్లీమీటర్లు, చెన్నూరులో 30 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఆసిఫాబాద్ పరిధిలోని బెజ్జూరులో 54.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రెబ్బెనలో 41.6 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. ఉట్నూరు డివిజన్ పరిధిలోని తిర్యాణిలో 36.2మిల్లీమీటర్లు, నిర్మల్ డివిజన్ పరిధిలోని లక్ష్మణ చాందాలో 30.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.