తన కోసం ప్రత్యేక హోదాను పణంగా పెడుతున్నారు

తన కోసం ప్రత్యేక హోదాను పణంగా పెడుతున్నారు - Sakshi


 చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత బొత్స ధ్వజం

♦ స్వలాభం కోసమే హోదాపై కేంద్రంమీద ఒత్తిడి తేవట్లేదు

♦ తనమీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరక్కుండా, భవిష్యత్తులో కేసులు రాకుండా ఉండేందుకే కేంద్రంతో లాలూచీ పడ్డారు

 

 సాక్షి, హైదరాబాద్ : తన వ్యక్తిగత హోదాను, ప్రతిష్టను పెంచుకోవడానికి సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రత్యేకహోదా అంశాన్ని పణంగా పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ నేతలు తమ రాజకీయ స్వార్థప్రయోజనాలు చూసుకోవడంతప్ప ప్రజల గురించి ఆలోచించట్లేదన్నారు.ప్రతి అంశాన్నీ తనకనుకూలంగా మల్చుకుని వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం చంద్రబాబుకు అల వాటని, తన రాజకీయస్వార్థం, స్వలాభంకోసమే ప్రత్యేకహోదాపై ఎన్డీయే ప్రభుత్వంమీద ఒత్తిడి తేవట్లేదన్నారు. రాజధానిని సింగపూర్‌కు తాకట్టు పెట్టడంద్వారా అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరక్కుండా ఉండేందుకు, తనపై భవిష్యత్తులో కేసులు రాకుండా ఉండేందుకే చంద్రబాబు కేంద్రంతో లాలూచీపడి ప్రత్యేకహోదా విషయంలో గట్టిగా పోరాడలేకుండా ఉన్నారని ఆయన అన్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు..

 ప్రత్యేకహోదా విషయంలో సీఎం, మంత్రులు మైండ్‌గేమ్ ఆడుతూ రాష్ట్రప్రజల్ని దగా, మోసం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాలు అధికారంలోకొచ్చి 14 నెలలు దాటుతున్నా విభజన బిల్లు సందర్భంగా ఇచ్చిన హామీమేరకు రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించలేకుండా ఉన్నారని దుయ్యబట్టారు. పార్లమెంటులో కేంద్రమంత్రులు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యపడదని తెగేసి చెబుతుంటే.. చంద్రబాబు, రాష్ట్రమంత్రులు మాత్రం ‘లేదు...లేదు...ఇంకా పరిశీలనలో ఉంది’ అంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎన్డీయేకు టీడీపీ మిత్రపక్షమే కనుక ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రమంత్రి చెప్పినపుడు టీడీపీ ఎంపీలు అప్పటికప్పుడే ఎందుకు అభ్యంతరం తెలిపి వారితో అనుకూల ప్రకటన ఇప్పించలేకుండా ఉన్నారని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు పత్రికా ప్రకటనలకు పరిమితమవకుండా బీజేపీ అగ్రనేతలతో మాట్లాడి ప్రత్యేకహోదాపై ఒప్పించడం లేదెందుకన్నారు. ప్రజలే మీ బట్టలిప్పే రోజు వస్తుంది..

 ప్రత్యేకహోదా కోసం బట్టలిప్పి తిరగమంటారా? అని ఓ సీనియర్ ఎంపీ అనడాన్ని బొత్స ఆక్షేపిస్తూ.. ‘హోదా’ను సాధించకపోతే ప్రజలే వారి బట్టలిప్పే రోజొస్తుందని హెచ్చరించారు. ప్రత్యేకహోదావల్ల ప్రయోజనమేంటీ? అది రాదని మాకూ తెలుసు, సీఎంకూ తెలుసని మరో ఎంపీ చెప్పడం దురదృష్టకరమన్నారు. ప్రత్యేకహోదా లేకపోయినా రూ.10 వేల కోట్లిస్తే చాలని కేంద్రమంత్రి సుజనాచౌదరి చెప్పడం చూస్తే వీరంతా కలసి ప్రజలతో మైండ్‌గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రత్యేకహోదా అక్కర్లేదు.. ప్యాకేజీ ఇస్తేచాలని రాష్ట్రమంత్రి ఒకరు చెప్పడాన్ని బొత్స ఆక్షేపించారు. ప్రత్యేకహోదాను సాధించేవరకూ వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని బొత్స స్పష్టం చేశారు.

 

 ధర్నాకు ప్రత్యేక రైళ్లు

 ఏపీ ప్రజల హక్కు-రాష్ట్రానికి ప్రత్యేక హోదా... అనే నినాదంతో 10వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగే ధర్నాకోసం 7వ తేదీ అర్థరాత్రి రెండు ప్రత్యేక రైళ్లను అనకాపల్లి, తిరుపతి నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు బొత్స తెలిపారు. ధర్నాలో పార్టీఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, క్రియాశీల జిల్లానేతలు పెద్దఎత్తున పాల్గొంటారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top