
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. డిసెంబర్ 21 నుంచి 23 వరకు వరంగల్‌లోని మడికొండలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 40 మంది విద్యార్థులు, టీచర్లు తమ సృజనాత్మక ప్రదర్శనలతో ప్రథ మ స్థానంలో నిలిచారు. వీరు ఈ నెల 8 నుంచి 12 వరకు సికింద్రాబాద్ సెయింట్ ప్యాట్రిక్ హైస్కూల్లో నిర్వహించే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో తమ ప్రదర్శనలను ఉంచబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు ఎగ్జిబిషన్‌లో ఉంటా యి. ఇందులో ఉత్తమ ప్రదర్శనలను జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక చేయనున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి 50 ఆవిష్కరణలకు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శనకు అవకాశం ఇచ్చామని, మొత్తం గా 300 ప్రదర్శనలు ఉంటాయని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి.శేషుకుమారి తెలిపారు.
40 ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలవే..
సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రం నుంచి పాల్గొనే 50 ప్రదర్శనల్లో 40 ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవి ఉండగా 10 ప్రదర్శనలు మాత్రమే ప్రైవేటు పాఠశాలలకు చెందినవి ఉన్నా యి. అలాగే 15 గ్రూపు ఎగ్జిబిట్స్‌లో 13 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులవే ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలే మెరుగు..: బి.శేషుకుమారి
ప్రైవేటు స్కూళ్లకంటే ప్రభుత్వ పాఠశాలలే మెరుగైనవని మరోసారి నిరూపితమైందని ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ శేషుకుమారి పేర్కొన్నారు.
ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కడియం..
ఈ నెల 8 నుంచి నిర్వహించే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ ప్రారంభ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరవుతారని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ తెలిపారు. 12న జరిగే ముగింపు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్‌కు హాజరుకావాలనుకునే పాఠశాలలు హైదరాబాద్ డీఈవోను సంప్రదించాలన్నారు.