‘గోదావరి’ కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వండి

Godavari board letter to Telangana government - Sakshi

ఏపీ అభ్యంతరాలపై మీ అభిప్రాయం చెప్పండి 

కాళేశ్వరం, సీతారామ సహా 7 ప్రాజెక్టుల వివరాలివ్వండి 

తెలంగాణ ప్రభుత్వానికి గోదావరి బోర్డు లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ చేసిన ఫిర్యాదులపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. గోదావరి బేసిన్‌లో చేపట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై తన అభిప్రాయాలను చెప్పాలని తెలంగాణను ఆదేశించింది. కొత్తగా నిర్మిస్తున్నారని ఏపీ చెబుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించాలని కోరింది. కాళేశ్వరం, సీతారామ, గోదావరి ఎత్తిపోతల పథకం ఫేజ్‌–3, తుపాకులగూడెం, మిషన్‌ భగీరథ, లోయర్‌ పెన్‌గంగపై నిర్మిస్తున్న రాజుపేట్, చనాకా–కొరట, పింపార్డ్, రామప్ప నుంచి పాకాల జలాల మళ్లింపు ప్రాజెక్టులకు గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఈనెల 14న ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేసింది.

దిగువ రాష్ట్రాల ప్రాజెక్టుల అవసరాలకు విఘాతం కలిగించేలా తెలంగాణ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తోందని, పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి వీటిని చేపడుతోందని ఏపీ.. బోర్డు దృష్టికి తెచ్చింది. ఈ ఫిర్యాదుపై అభిప్రాయాలను వెంటనే తెలియజేయాలని తెలంగాణను కోరుతూ గోదావరి బోర్డు సభ్యుడు పీఎస్‌ కుటియాల్‌ బుధవారం తెలంగాణకు లేఖ రాశారు. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతలను 225 నుంచి 450 టీఎంసీలకు, సీతారామ ఎత్తిపోతలను 70 నుంచి 100 టీఎంసీలకు పెంచుతున్నారని ఏపీ లేవనెత్తిన అంశాలను లేఖలో బోర్డు ప్రస్తావించింది.

ఏపీ అభ్యంతరాలు చెబుతున్న ఈ ప్రాజెక్టులపై గతేడాది ఆగస్టులోనే చర్చించామని, ప్రాజెక్టుల వివరాలు మాత్రం తెలంగాణ ఇంకా బోర్డుకు సమర్పించలేదని గుర్తు చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 85(8)(డి) ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు కట్టినా బోర్డుకు ప్రతిపాదన పంపాలని, జల వివాదాల ఉల్లంఘనæ జరగడం లేదని తేలాకే బోర్డు అనుమతులు ఇస్తుందని, ఆ తరువాతే ప్రాజెక్టులపై ముందుకెళ్లాలన్నారు. పదో షెడ్యూల్‌ పేరా–7 ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై చేపట్టే ప్రాజెక్టులకు అపెక్స్‌ అనుమతి తప్పనిసరన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఇప్పటికైనా ఏపీ చేసిన ఫిర్యాదుపై తెలంగాణ తన అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top