
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో పారిశుధ్య నిర్వహణ, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, అనుమతి లేని భవన నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ తప్పుబట్టారు. అధికారులు, సిబ్బంది తీరుపై తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు. బేగంపేట, ఖైరతాబాద్ సర్కిళ్ల పరిధిలో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, అనుమతిలేని నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న ఖైరతాబాద్ ఇన్‌చార్జి, బేగంపేట అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుభాష్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. బుధవారం జీహెచ్‌ఎంసీ జోనల్, డిప్యూటీకమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ.. ఆరు నెలలుగా ఎన్నికల నియమావళి అమలు నెపంతో పారిశుధ్యం, అక్రమనిర్మాణాలు, ఫుట్‌పాత్‌ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో ఉదయం తనిఖీలు చేయకపోవడం వల్లే పారిశుధ్య నిర్వహణ కుంటుపడిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఇమేజ్ మొత్తం హైదరాబాద్ నగరం పైనే ఉందని, అక్రమ నిర్మాణాలు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై అలసత్వం వహించే జీహెచ్‌ఎంసీ అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో వెలుస్తున్న ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను నిరోధించడంలో టౌన్ ప్లానింగ్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వహిస్తున్నారని తప్పుబట్టారు. తీరు మార్చుకోకపోతే ఇంజినీరింగ్ అధికారులతోనైనా టౌన్ ప్లానింగ్ విధులను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన హెచ్చరించారు.
బ్యానర్లు, హోర్డింగ్ తొలగించాలి
ఇటీవల సూరత్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ.. నగరంలోని అమీర్‌పేట్‌లో ఉన్న పలు కోచింగ్ సెంటర్లు తమ బ్యానర్లు, హోర్డింగ్‌లను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశాయని, వాటిని వెంటనే తొలగించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ సిబ్బందికి ఆదేశించారు. బేగంపేట్‌లోని ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తూ శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేసినా వాటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహించిన బేగంపేట్ సహాయ టౌన్‌ప్లానింగ్ అధికారిని తీవ్రంగా హెచ్చరించారు. అనుమతిలేని హోర్డింగ్‌లు, జంక్షన్లలో ప్రకటనలకు సంబంధించి బిల్ బోర్డులు అక్రమంగా ఏర్పాటు చేశారని, వీటిని తొలగించాలన్నారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాల మెరుగు, ఆక్రమణల తొలగింపుపై గణనీయ మార్పు రావాలని, ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు చిత్తశుద్ధితో కృషిచేయాలని సూచించారు. ఆక్రమణల తొలగింపు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానిది కాదని, వీటిని టౌన్ ప్లానింగ్ అధికారులే చేపట్టాలని స్పష్టం చేశారు.
వారం రోజుల్లో మార్పు రావాలి: కమిషనర్ దానకిశోర్
నగరంలో స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణ వారం రోజుల్లో గణనీయ మార్పు రావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని తొమ్మిది వేలకు పైగా ఓపెన్ గార్బేజీ పాయింట్లను ఎత్తివేసినప్పటికీ తిరిగి ఏర్పడ్డాయని, ఇందుకు ప్రధాన కారణం ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్లక్ష్య వైఖరేని, ఆ శాఖ పర్యవేక్షణ లోపం కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. నిబంధనలను అతిక్రమించే వారికి భారీగా జరిమానాలు విధించాలని సూచించారు. రంజాన్ అనంతరం వరుస పండగలు వస్తున్నాయని, పారిశుధ్య కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. టౌన్‌ప్లానింగ్ విభాగం పనితీరు ప్రస్తావిస్తూ తనకు ప్రతిరోజు అందే ఫిర్యాదుల్లో 80 శాతానికి పైగా టౌన్‌ప్లానింగ్‌వేనన్నారు. హైకోర్టులో కేవలం టౌన్‌ప్లానింగ్ సంబంధించి మూడువేలకు పైగా కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్లు శృతి ఓజా, సందీప్‌ఝా, జోనల్ కమిషనర్లు హరిచందన, రఘుప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్య, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.