ఆటలో ఆగిన ప్రాణం.. | Engineering graduate dies during kabaddi in Khammam | Sakshi
Sakshi News home page

ఆటలో ఆగిన ప్రాణం..

Sep 1 2017 10:34 AM | Updated on Sep 28 2018 3:39 PM

ఆటలో ఆగిన ప్రాణం.. - Sakshi

ఆటలో ఆగిన ప్రాణం..

అప్పటిదాకా సరదా, సంతోషం..అంతలోనే విషాదం, దుఃఖం..కబడ్డీ కూతకు వెళ్లొచ్చి కుప్పకూలాడు..

అప్పటిదాకా సరదా, సంతోషం..అంతలోనే విషాదం, దుఃఖం..కబడ్డీ కూతకు వెళ్లొచ్చి కుప్పకూలాడు..మరో లోకానికి మల్లికార్జున్‌ వెళ్లిపోయాడు.

రఘునాథపాలెం(ఖమ్మం):
     
► రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడు గ్రామం. అక్కడి యువకులంతా కలిసి స్థానిక ఆర్‌ అండ్‌ బీ రోడ్డు పక్కన వినాయక మండపం ఏర్పాటు చేశారు. పూజల అనంతరం, అక్కడ ప్రతి రోజూ ఆటపాటలు నిర్వహిస్తున్నారు. సరదా సరదాగా, సందడి సందడిగా సాగుతోంది.
     
►మండపం వద్ద బుధవారం రాత్రి పూజలు పూర్తయ్యాయి. విద్యుత్‌ వెలుగుల్లో యువకులంతా కబడ్డీ ఆడుతున్నారు. దాదాపుగా ఊరి జనమంతా ఆసక్తిగా, ఆనందంగా చూస్తున్నారు. అప్పటికే నాలుగు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.
     
► తర్వాతి జట్టు రంగంలోకి దిగింది. అందులో మల్లికార్జున్‌(24) ఉన్నాడు. ఆట రసవత్తరంగా సాగుతోంది. మల్లికార్జున్‌ కూతకు వెళ్లాడు.. వచ్చాడు. ఎదుటి జట్టులోని ఓ యువకుడు కూతకు వస్తున్నాడు. అంతలోనే మల్లిఖార్జున్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
     
► అక్కడి ఆటగాళ్లందరిలో, చూస్తున్న జనంలో అయోమయం, ఆందోళన. సమీపంలోగల ఏఎన్‌ఎం వచ్చి చూశారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అందరూ కలిసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షిస్తుండగానే ప్రాణాలొదిలాడు.
     
► మల్లికార్జున్‌ బీటెక్‌ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా కొన్ని కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. అతడికి తల్లిదండ్రులు, అన్న, సోదరి ఉన్నారు. సోదరికి వివాహమైంది. చెన్నైలో అన్న ఉద్యోగం చేస్తున్నాడు.
     
►‘‘నాలుగైదు నెలల్లో ఉద్యోగంలో చేరతాడని, జీవితంలో స్థిరపడతాడని, మాకు అండగా ఉంటాడని ఆశపడ్డాం. దేవుడికి పూజ చేశాడు. దేవుడి మండపం వద్ద ఆడాడు. చివరికి, ఆ దేవుడి వద్దకే వెళ్లాడు’’ అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. మిత్రులు, గ్రామస్తులు కూడా కంటతడి పెట్టారు.
     
►తండ్రి నాగులు ఫిర్యాదుతో ఎస్‌ఐ గోపి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement