దసరా మామూళ్లు.. నగలు, నెక్లెస్‌లు!

Employees Demand Gifts Instead Of Money - Sakshi

డబ్బుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాధికారుల వసూళ్లు

సెప్టెంబర్‌ 1 నుంచి ఏసీబీకి చిక్కిన12 మంది

ఆడియో, వీడియో సాక్ష్యాలతో పట్టుకుంటున్న ఏసీబీ

ఈ ఏడాదిలో 130కి చేరిన అవినీతి కేసులు 

‘‘మీ లైసెన్స్‌ రెన్యూవల్‌కుచాలా ఇబ్బందులు ఉన్నాయి..నాకు లంచం వద్దు.. అసలుమా వంశంలోనే ఎవరూ లంచంతీసుకోలేదు. కానీ, నా కూతురికి చిన్న గిఫ్ట్‌ ఇవ్వండి. అది కూడాఓ నాలుగు లక్షల నెక్లెస్‌ అంతే’’.. ‘‘రూ.70 లక్షల బిల్లు మంజూరు చేస్తే నాకేంటి.. అలాగని నేను లంచం తీసుకునే మనిషిని కాదు.. కేవలం 5 శాతం కమీషన్‌. అంటే మూడు లక్షల యాభై వేలు ఇచ్చేస్తే మీ పని అయిపోతుంది. ఇందులో నాకేం మిగలదు.. నేనూ పైవారికి ఇచ్చుకోవాలి’’

సాక్షి, హైదరాబాద్‌: దసరా పండగ కోసం చాలామంది ప్రభుత్వాధికారులు లంచాల కోసం అడ్డదారులు తొక్కారు. ఈ క్రమంలో ఎక్కడా లంచం అన్న మాటే వాడలేదు. వాటికి బహుమతులు, కమీషన్లు ఇలా రకరకాల పేర్లు చెప్పి వసూలు చేశారు. వీరిలో పాతికేళ్ల సీనియర్ల నుంచి డ్యూటీలో చేరి పట్టుమని రెండు నెలలు కూడా పూర్తికాని వారుండటం గమనార్హం. ఒకరిని చూసి మరొకరు లంచాల వసూళ్లలో పోటీ పడ్డారు. గతంలో ఎప్పుడూ లేనిది ఈసారి అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కి దసరా ముందు అనేక మంది లంచాల పీడితులు తమగోడు వెళ్లబోసుకున్నారు. దీంతో వారందరికీ ఉచ్చు బిగించిన ఏసీబీ అధికారులకు సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 12 (దసరా) వరకు ఏకంగా 12 మంది చిక్కడం గమనార్హం. అంటే సగటున ప్రతీ నాలుగు రోజులకు ఒకరు చొప్పున ఏసీబీ వలలో చిక్కారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏసీబీలో నమోదైన కేసుల జాబితా దాదాపు 130కి చేరింది.

పకడ్బందీగా బుక్‌ చేస్తోన్న ఏసీబీ..
సాక్ష్యాధారాల సేకరణలో ఏసీబీ రూటుమార్చింది. తమ వద్దకు వచ్చిన బాధితుల విషయాలను ధ్రువీకరించుకునేందుకు కొంత సమయం తీసుకుంటోంది. తరువాత సదరు అధికారిని జాగ్రత్తగా ట్రాప్‌ చేస్తారు. అతని ఫోన్‌కాల్స్‌ సంభాషణలు, లంచం తీసుకుంటుండగా రహస్య వీడియో తీయడం వరకు అంతా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిందితుడికి న్యాయస్థానంలో కచ్చితంగా శిక్ష పడేలా ఆధునిక సాంకేతికత సాయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘‘గతంలో లాగ కాదు..ఇపుడు ఏసీబీ కేసులో చిక్కుకుంటే బయటపడటం దాదాపుగా అసాధ్యం’’ అని ఓ ఏసీబీ ఉన్నతాధికారి చెప్పారు.

నెక్లెస్‌ గిఫ్ట్‌గా..
ఇటీవల హైదరాబాద్‌లో ఓ బ్లడ్‌బ్యాంక్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ విషయంలో అప్పటికే రూ.50 వేలు లంచం తీసుకున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మి.. మరింత లంచం కోసం గిఫ్ట్‌కింద రూ.1.10 లక్షల నెక్లెస్‌ని అడిగింది. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో, ఏసీబీ అధికారులు  నెక్లెస్‌ షాపింగ్‌ మొత్తం ఆడియో, వీడియో సాక్ష్యాధారాలతో సహా రెడ్‌çహ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రెండునెలలకే లంచం..
తుర్కయాంజల్‌ వీఆర్వో శేఖర్‌ తన వద్దకు భూమి మ్యుటేషన్‌ కోసం వచ్చిన ఓ రైతు వద్ద రూ.లక్ష లంచం అడిగాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో వారు వలపన్ని పట్టుకున్నారు. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే.. నిందితుడు శేఖర్‌ వీఆర్వోగా చేరి అప్పటికి కేవలం రెండు నెలలే అయింది. తోటివారి అవినీతి చూసిన శేఖర్‌ అక్రమమార్గం పట్టినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top