క్రైం 'లాక్‌ డౌన్‌'

Crime Rate Down in Lockdown Time Siddipet - Sakshi

పూర్తిగా తగ్గిన క్రైమ్‌ రేట్‌..

లాక్‌డౌన్‌కాలంలో గణనీయమైన మార్పులు

దాదాపుగా రోడ్డెక్కని వాహనాలు

అడుగడుగునా పోలీసుల తనిఖీలు

గతేడాదితో పోల్చితేరెండు నెలల్లో తగ్గిన చోరీలు, ప్రమాదాలు

సిద్దిపేటకమాన్‌: జిల్లాలో క్రైమ్‌ రేటు గణనీయంగా తగ్గిపోయింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించడంతో పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే రహదారులు బోసిపోయాయి. రోడ్లపై ఎప్పుడు ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. కానీ కరోనా లాక్‌డౌన్‌ ఫలితంగా రోడ్లపైకి వాహనాలు రాకపోవడంతో జిల్లాలో ప్రమాదాల సంఖ్య చాలా మేరకు తగ్గింది.  కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూని అమలు చేసింది. అదే విధంగా 23వ తేదీ నుంచి జిల్లాలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. 56 రోజులపాటు జరిగిన లాక్‌డౌన్‌లో మార్చి 22 నుంచి మే 15వరకు జిల్లాలో 15 దొంగతనాలు, 25 రోడ్డు ప్రమాదాలు మాత్రమే చోటు చేసుకున్నాయి. 

నిరంతర నిఘా..
కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పోలీసులు పటిష్టంగా అమలు చేయడానికి నిరంతర నిఘాను ఏర్పాటు చేశారు. సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో కమిషనరేట్‌ పరిధిలో జిల్లా సరిహద్దులతో పాటు మండల కేంద్రాలు, సరిహద్దుల్లో పోలీసు పికెటింగ్, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నాలుగు బార్డర్‌ చెక్‌పోస్టులు, 24 పికెట్లను ఏర్పాటు చేసి 880 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో భాగంగా 24 గంటలు పోలీసుల నిఘా కొనసాగడం, వారు తీసుకుంటున్న చర్యల కారణంగా ఎక్కువ వాహనాలు రోడ్లపైకి రాలేదు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులతో బయటకు రావొద్దని చెప్పడం, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల వాహనాలను సీజ్‌ చేయడంతో రోడ్లపైకి ఎక్కువగా వాహనాలు తిరగలేదు. ఫలితంగా వాహనాల రాకపోకలు తగ్గిపోవడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. గతేడాది మార్చి, ఏప్రిల్, మేతో పోల్చితే ఈ సంవత్సరం మూడు నెలల్లో క్రైమ్‌ రేటు చాలా తగ్గిందని చెప్పవచ్చు. జిల్లాలో గత నెల 23న జరిగిన ఒక హత్య ఘటన మినహా ఇతర కేసులు నమోదు కాలేదు. లాక్‌డౌన్‌ ఫలితంగా జిల్లాలో గణనీయంగా క్రైమ్‌ రేటు తగ్గినట్లు అధికారులు తెలుపుతున్నారు.   

అందరూ సహకరించాలి
లాక్‌డౌన్‌ కాలంలో జిల్లాలో క్రైమ్‌ రేటు చాలా తగ్గింది. ప్రజలంతా ఇంటి వద్దనే ఉంటున్న కారణంగా దొంగతనాలు తగ్గడంతో పాటు ఘర్షణ కేసులు సైతం నమోదు కాలేదు. ఈ మధ్య కాలంలో ఆరు నెలల నుంచి దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి. జైళ్ల నుంచి విడుదలైన దొంగలపైన క్రైం పార్టీ సిబ్బంది నిఘా ఉంచడం వల్ల దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి. రోడ్లపై వాహనాలు తిరగకపోవడంతో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. – జోయల్‌ డేవిస్,సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top