‘కోవిడ్‌ కేస్‌షీట్‌’ ఏం చేద్దాం?

Covid 19: Gandhi Hospital Officials Bother About Covid Case Sheet - Sakshi

గాంధీ ఆస్పత్రి పాలనా యంత్రాంగం తర్జనభర్జన

హైదరాబాద్‌: తెలంగాణలో నమోదైన తొలి కోవిడ్‌ కేసులో బాధితునికి మెరుగైన వైద్యసేవలందించి, రోగాన్ని నయంచేసి డిశ్చార్జ్‌ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, గాంధీ వైద్యులకు దక్కుతుంది. అయితే బాధితుడికి అందించిన వైద్యసేవలు, చికిత్స వంటి వివరాల్ని పొందుపర్చిన కేస్‌షీట్‌ వ్యవహారం మాత్రం గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. నగరంలోని మహేంద్రహిల్స్‌కు చెందిన యువకుడు దుబాయ్‌కు వెళ్లొచ్చాక కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఈ నెల 1న గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డు, తర్వాత అత్యవసర విభాగంలోని ఎక్యూట్‌ మెడికల్‌ వార్డులో చేర్చుకుని చికిత్స అందించారు. ఎట్టకేలకు కోలుకోగా, చివరిగా అనేక పరీక్షల అనంతరం కోవిడ్‌ నెగెటివ్‌ రావడంతో ఈ నెల 13న రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. ఇన్ని రోజుల పాటు బాధితునికి అందించిన సేవలు, చికిత్స, మందులు, ఫ్లూయిడ్స్, బీపీ, సుగ ర్‌ వంటి వివరాలన్నీ కేస్‌షీట్‌లో పొందు పర్చారు.

మామూలు రోగులను డిశ్చార్జ్‌ చేస్తే అతని కేస్‌షీట్‌ను పదేళ్లపాటు భద్రపరచాలని నిబంధన. దీంతో ఆయా కేస్‌షీట్లను ఆస్పత్రి ప్రధాన భవనం మొదటి అంతస్తులోని మెడికల్‌ రికార్డు రూంలో భద్రపరుస్తారు. తాజా కేస్‌షీట్‌ కోవిడ్‌ బాధితునిది కావడం, కేస్‌షీట్‌ కాగితాలపై వైరస్‌ అంటు కుని ఉంటుందని, దానిని తాకితే ఇతరులకూ వ్యాపిస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ కేస్‌షీట్‌ను జిరాక్స్‌ లేదా స్కానింగ్‌ చేస్తే.. యంత్రాలకూ వైరస్‌ అంటుకుని ఇతరులకు వ్యాపిస్తుందనేది మరికొందరి వాదన. ఈ నేపధ్యంలో ‘కోవిడ్‌ కేస్‌షీట్‌’ను ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. బాధితుడు వాడిన చెప్పులు, టూత్‌బ్రష్, దుస్తులు, వాడిన సిరంజీలు, సెలైన్‌ ఫ్లూయిడ్‌ బ్యాగులు వంటివన్నీ బయో మెడికల్‌ వేస్టేజ్‌ ద్వారా నిర్వీర్యం చేశారు. ఒక్క కేస్‌షీట్‌ విషయం మాత్రం తేలలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేస్‌షీట్‌ను దళసరి పాలిథిన్‌ బ్యాగ్‌లో పెట్టి, సీల్‌చేసి, దానిపై వైరస్‌ నివారణకు వినియోగించే ద్రావణాలను పూసి, ప్రత్యేక బీరువాలో భద్రపర్చాలని నిర్ణయించినట్టు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top