అవిశ్వాసం ఆపేయండి!

Corporators Stop The Infidelity Says KTR - Sakshi

అధిష్టానం హుకూం

ఎమ్మెల్యేకు కేటీఆర్‌ ఫోన్‌

కట్టుబడాలన్న ఎమ్మెల్యే

వెనక్కితగ్గేది లేదన్న కార్పొరేటర్లు

అవిశ్వాసం నెగ్గిస్తాం లేదంటే రాజీనామాలు చేస్తామని వెల్లడి

రసకందాయంలో రామగుండం రాజకీయం

సాక్షి, పెద్దపల్లి: రామగుండం అవిశ్వాస రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం అవిశ్వాసాన్ని ఆపేయాలంటూ అల్టిమేటం జారీచేయగా, హైకమాండ్‌ ఆదేశానికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సూచించారు. అయితే అవిశ్వాసం నోటీసు ఇచ్చాక ఇప్పుడు వెనక్కి తగ్గేదిలేదని, ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గిస్తామని, లేదంటే తమ కార్పొరేటర్‌ పదవులకైనా రాజీనామా చేస్తామని టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు తెగేసి చెప్పారు. దీంతో రామగుండం అవిశ్వాసం రాజకీయం రసకందాయంలో పడింది.

ఎమ్మెల్యేకు కేటీఆర్‌ ఫోన్‌
రామగుండం మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై టీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ మండిపడింది. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్వయంగా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు ఫోన్‌చేసి అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించారు. అవిశ్వాసం పెట్టడం పార్టీ విధానం కాదని, వెంటనే అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రామగుండం పరిస్థితిని వివరించడానికి ఎమ్మెల్యే ప్రయత్నించినా కేటీఆర్‌ వినిపించుకోలేదని విశ్వసనీయంగా తెలిసింది. ‘‘అవిశ్వాసం ఆపేస్తారా...అవిశ్వాసం లేకుండా ఆర్డినెన్స్‌ తీసుకురమ్మంటారా’’ అని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.

 
సీఎంకు మేయర్ల ఫిర్యాదు
పార్టీ అధిష్టానం అకస్మాత్తుగా అవిశ్వాసం వ్యవహారంపై దృష్టిపెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు కారణమని సమాచారం. శనివారం హైదరాబాద్‌లో మేయర్లు, కమిషనర్ల సమావేశం జరిగింది. సమావేశానికి రామగుండం మేయర్‌ లక్ష్మీనారాయణ సహా, ఆరుగురు మేయర్లు హాజరయ్యారు. సమావేశం పూర్తయ్యాక, ఆరుగురు మేయర్లు సీఎం కేసీఆర్‌ను కలిసి రామగుండం మేయర్‌పై సొంత పార్టీయే అవిశ్వాసం పెట్టిందంటూ ఫిర్యాదు చేశారు.  స్పందించిన కేసీఆర్‌ అవిశ్వాసం పెట్టడమేంటంటూ అసహనం వ్యక్తం చేశారని, వెంటనే తన రాజకీయ కార్యదర్శి నరసింహారావు, మంత్రి కేటీఆర్‌లకు ఈ విషయంపై పురమాయించినట్లు సమాచారం. ఈక్రమంలోనే కేటీఆర్, నరసింహారావులు ఎమ్మెల్యే సత్యనారాయణకు ఫోన్‌చేసి అవిశ్వాసాన్ని ఆపేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 
అధిష్టానం చెప్పింది వినండి: ఎమ్మెల్యే
అవిశ్వాసం నిలిపివేసి...కలిసి పనిచేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించింది..అధిష్టానం సూచనను కార్పొరేటర్లంతా పాటించాలి...అంటూ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో టీఆర్‌ఎస్‌కు చెందిన 30 మంది కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్‌ ఫోన్‌చేసిన విషయాన్ని వివరించారు. ఇంతటితో ఈ వ్యవహారాన్ని ఆపేయాలని కార్పొరేటర్లకు చెప్పారు.
 
వెనక్కి తగ్గేది లేదు: కార్పొరేటర్లు
అవిశ్వాసంపై వెనక్కి తగ్గేదిలేదు. నోటీసు ఇచ్చాక..ఇప్పుడు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలప్పుడు లేని హైకమాండ్‌ ఇప్పుడే వచ్చిందా? మేం అవిశ్వాసానికే కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గిస్తాం. లేదంటే మా కార్పొరేటర్‌ పదవులకే రాజీనామా చేస్తాం. అంటూ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు తేల్చిచెప్పారు. పార్టీ అధిష్టానం వైఖరిని ఎమ్మెల్యే చెప్పినా.. కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ఒకదశలో ఎమ్మెల్యేను సైతం ధిక్కరించారు. ఇదిలాఉంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా అవిశ్వాసాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
 
రాజకీయం రసవత్తరం
అవిశ్వాసం ఆపేయాలని అధిష్టానం ఆదేశించడం...ఎమ్మెల్యే చెప్పినా...కార్పొరేటర్లు ససేమిరా అనడంతో రామగుండంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నాటకీయ పరిణామాలతో అవిశ్వాసం రోజుకోమలుపు తిరుగుతోంది. పార్టీ వైరి వర్గాల ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయ చదరంగం రక్తికడుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top