‘లాక్‌’ తీస్తే కరోనాతో కష్టమే..

Corona Increases If The Lockdown Is Lifted In Hyderabad - Sakshi

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో కేసులు పెరుగుతాయ్‌!

వైరస్‌ వ్యాప్తిపై అమెరికా నిపుణుల హెచ్చరిక

అనుమానితులను వేగంగా గుర్తించి పరీక్షలు జరపాలి..

వ్యాక్సిన్‌ వచ్చే వరకూ నివారణ చర్యలు తప్పనిసరని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలను దాదాపు ఎత్తేసిన నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అమెరికా నిపుణులు స్పష్టం చేశారు. అనుమానితులను వీలైనంత త్వరగా గుర్తించి, పరీక్షలు జరపడం ఒక్కటే ప్రభుత్వాల ముందున్న కర్తవ్యమని చెప్పారు. కరోనాను నివారించే టీకా కోసం అమెరి కా సహా అనేక దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయని, ప్రస్తుతానికి ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టీకా ఏదీ అందుబాటులో లేని కారణంగా వైరస్‌ నివారణ చర్యలను తప్పనిసరిగా పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రణలో ఉంచవచ్చని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) మిషన్‌ డైరెక్టర్‌ మేఘన దేశాయి తెలిపారు. (లక్ష దాటేశాయ్‌..!)

‘భారత్‌లో కరోనాను ఎదుర్కొనే విషయంలో అమెరికా సహాయ సహకారాలు’ అంశంపై నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ విలేకర్ల సమావేశంలో మేఘన దేశాయితోపాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ ప్రతినిధి ప్రీతా రాజారామన్, యూఎస్‌ ఎయిడ్‌ డైరెక్టర్‌ రమోనా ఎల్‌ హంజాయి వేర్వేరు అంశాలపై మాట్లాడారు. టీకా తయారీ, లాక్‌డౌన్‌ ఎత్తివేత తరువాతి పరిస్థితులపై మేఘన మాట్లాడుతూ.. భారత్, అమెరికాలు వ్యాక్సిన్‌ యాక్సిస్‌ ప్రోగ్రామ్‌ ద్వారా టీకా తయారీకి పరస్పరం సహకరించుకుంటున్నాయని, కరోనా నివారణ టీకా ఏ దేశంలో తయారైనా దాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని వివరించారు. కరోనా వైరస్‌ ఉధృతి మొదలైనప్పటి నుంచి రెండు దేశాలు సహకరించుకుంటున్నాయని, నమూనాల సేకరణ మొదలు నీటి శుద్ధి వరకూ పలు అంశాల్లో అమెరికా భారతీయ వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చిందని డాక్టర్‌ ప్రీతా రాజారామన్‌ తెలిపారు.(డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగుతాం)

ఎయిమ్స్‌ వంటి సంస్థలతో అమెరికన్‌ సంస్థలు కలసి పనిచేస్తున్నాయన్నారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో 300 మంది ఆరోగ్య అధికారులకు సాంక్రమిక వ్యాధుల నియంత్రణపై శిక్షణనిచ్చామని తెలిపారు. మహిళ స్వయం సహాయక బృందాలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతిచ్చి.. వారు తయారు చేసిన వైద్య పరికరాలను అవసరమైన వారికి విక్రయించేలా చేశామని వివరించారు. (ఏపీలో 2,58,450 మందికి కరోనా పరీక్షలు)

దశలవారీగా 200 వెంటిలేటర్లు..
కరోనాను ఎదుర్కొనేందుకు భారత్‌కు త్వరలోనే 200 వెంటిలేటర్లను అందించనున్నట్టు యునైటెడ్‌ స్టేట్స్‌ ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిడ్‌ (యూఎస్‌ఎయిడ్‌) డైరెక్టర్‌ రమోనా ఎల్‌ హం జాయి తెలిపారు. భారత్‌ అవసరాలకు తగ్గట్టుగా తయారైన వీటిని కొన్ని వారాల్లోగా దశల వారీగా పంపుతామని ఆమె తెలిపారు. కరోనాపై పోరుకు అమెరికా 90 కోట్ల డాలర్లను అందుబాటులో ఉంచిందని, భారత్‌ విషయానికొస్తే సుమారు రూ.44.6 కోట్లు అదనంగా అందించామని వివరించారు. భారత్‌కు అందించిన మొత్తంలో కరోనా వ్యాధి బాధితుల చికిత్స, కరోనాపై అవగాహన పెంచేందుకు మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చేందుకు, రోగులు సంప్రదించిన వారిని వెతికేందుకు రూ.21 కోట్లు ఉపయోగిస్తారని, దీంతో పాటు 14 రాష్ట్రాల్లోని సుమారు 20 వేల ఆరోగ్య శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ నిధులను వాడుతున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేసేందుకు, ప్రైవేట్‌ సంస్థల నుంచి అదనపు నిధులను సేకరించేందుకు వీలుగా మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేస్తారని వివరించారు.(అన్ని ఆసుపత్రుల్లోనూ ‘ఆక్సిజన్‌’ తప్పనిసరి ) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top