గ్రూప్‌–4 ప్రశ్నపత్రంలో గందరగోళం | Confusion in Group-4 question paper | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–4 ప్రశ్నపత్రంలో గందరగోళం

Oct 8 2018 12:47 AM | Updated on Oct 8 2018 12:47 AM

Confusion in Group-4 question paper - Sakshi

ఈసీఐఎల్‌ శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో తారుమారైన ప్రశ్నపత్రాలను చూపిస్తున్న అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌– 4 పరీక్ష గందరగోళంగా జరిగింది. దీంతో ఆదివారం పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. పేపర్‌–1 సెట్‌ బీలోని ప్రశ్నలు సెట్‌–ఏలో కనిపించాయి. ప్రశ్నపత్రంలో తలెత్తిన తప్పుల వల్ల పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. పేపర్‌– 1 పరీక్షలో ఏ సిరీస్‌ ప్రశ్నపత్రంలో విద్యార్థులకు కొన్ని పేజీలు మిస్సయ్యాయి. మరోవైపు బీ సిరీస్‌ నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా కొన్ని రిపీట్‌ అయ్యాయని విద్యార్థులు ఆరోపించారు.

ఏ సిరీస్‌ ప్రశ్నప్రత్రంలో బీ సిరీస్‌కు చెందిన 16, 17, 18, 19, 20, 21, 45, 46, 63, 64, 65, 73, 74, 75, 90, 91, 92, 93, 100, 101, 119, 120, 121, 122, 123, 124 తదితర ప్రశ్నలు ఒక సిరీస్‌కు బదులు మరో సిరీస్‌లో వచ్చాయి. ఏ సిరీస్, బీ సిరీస్‌ రెండూ ఒకే ప్రశ్నపత్రంలో ఉన్నందున పరీక్ష సరిగా రాయలేకపోయామని అభ్యర్థులు ఆరోపించారు. అయితే టీఎస్‌ పీఎస్సీ మాత్రం కొన్ని పొరపాట్లు దొర్లినందున అందుబాటులో ఉన్న మరో పేపర్‌ ఇచ్చి పరీక్ష రాయించామని తెలిపింది.

ఇదిలా ఉండగా హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లోని శ్రీచైతన్య కళాశాలలో గ్రూప్‌– 4 పరీక్షలు రాస్తున్న 6 అభ్యర్థులకు ఏ–1 సిరీస్‌ ప్రశ్నపత్రంలో బీ సిరీస్‌ ప్రశ్నలు వచ్చాయి. దీంతో విషయాన్ని ఇన్విజిలేటర్లకు చెప్పగా వారు టీఎస్‌పీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఒక దశలో అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్‌ బందోబస్తు మధ్య పరీక్షలు పూర్తయినప్పటికీ తమకు న్యాయం చేయాలని వారు టీఎస్‌పీఎస్సీని కోరారు.  

65 శాతం హాజరు..:  గ్రూప్‌–4 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4.80 లక్షల మందికిగాను 3.12 లక్షల (65 శాతం) మంది హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. 1,046 కేంద్రాల్లో జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్‌ తెలిపారు.

అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లా లో 75 శాతం మంది, ఆ తర్వాత వరంగల్, మహ బూబ్‌నగర్‌ జిల్లాల్లో 74 శాతం చొప్పున హాజరయ్యారని వెల్లడించారు. ఇక, ఆసిఫాబాద్‌ జిల్లాలో కేవలం 12 శాతం మాత్రమే హాజరైనట్లు ఆమె వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో బిల్‌ కలెక్టర్లు, టీఎస్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో వివిధ పోస్టులు, అలాగే టీఎస్‌ఆర్టీసీలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement