పరీక్షలపై ఇంటర్ బోర్డ్ ప్రత్యేక దృష్టి
ముఖ్యమైన అంశాలపై పునఃశ్చరణ
ప్రతీ కాలేజీలో సీసీ కెమెరాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: పరీక్షలపై ఇంటర్ బోర్డ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య క్షేత్రస్థాయి ఇంటర్ అధికారులతో రెండు రోజులుగా టెలి కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈసారి పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాలేజీల్లో పునఃశ్చరణ, విద్యార్థులు, అధ్యాపకుల హాజరును ఇక నుంచి రెగ్యులర్‌గా పర్యవేక్షించాలని అధికారులకు చెబుతున్నారు.
వరుసగా క్లాసులకు హాజరవ్వని విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలని, కారణాలు తెలుసుకోవాలంటున్నారు. ఇంటర్ బోర్డ్ ప్రతీ కాలేజీని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తోంది. కాలేజీల్లోని కెమెరాలు బోర్డ్ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేశారు. వీటిని పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బోధన పద్ధతులు, హాజరు శాతాన్ని గమనిస్తున్నారు. మంచి ఫలితాలు సాధించిన కాలేజీలకు ఈసారి ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదన కూడా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
జేఈఈ, నీట్‌పై కూడా....
ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు నీట్, జేఈఈపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. నవంబర్ నెలాఖరు నుంచి మరింత పెంచాలని నిర్ణయించారు. అన్ని కాలేజీల్లోనూ అవసరమైతే ప్రత్యేక నిపుణులను కూడా ఏర్పాటు చేయా లని భావిస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షలకు రూ.లక్షల్లో వెచ్చించాల్సిన అవసరం లేదని, ప్రభు త్వ ఇంటర్ కాలేజీల్లో మెరుగైన శిక్షణ ఇస్తామని తల్లిదండ్రులకు కాలేజీల సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. నీట్, జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఏయే చాప్టర్లలో మెరుగ్గా ఉన్నారు? ఎందులో వెనుకబడి ఉన్నారు? అనే వివరాలను ప్రతీ కాలేజీ జిల్లా అధికారులకు పంపుతోంది.
జిల్లా అధికార బృందం వీటిని విశ్లేషించి అవసరమైన సలహాలు ఇస్తోంది. దీని ఆధారంగా విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ ఇవ్వొచ్చని నిర్ణయించారు. నీట్, మెయిన్స్‌కు అవసరమైన మెటీరియల్ రూప కల్పనలోనూ అధికారులు ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొన్నేళ్లుగా వస్తున్న ప్రశ్నల నమూనాలను నిశితంగా పరిశీలించి, వాటి ఆధారంగానే మాదిరి ప్రశ్నపత్రాలు, మెటీరియల్ రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.
మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నాం
ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సీసీ కెమెరాల ఏర్పాటు, నిరంతర పర్యవేక్షణ జవాబుదారీతనాన్ని పెంచాం. పోటీ పరీక్షలకు కూడా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. బయట కోచింగ్ కేంద్రాలకన్నా నాణ్యమైన శిక్షణ ఇవ్వబోతున్నాం. – కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి


