ఫిరాయింపులకు కోడ్‌ వర్తించదు  | Complete basic level arrangements for the Lok Sabha elections | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులకు కోడ్‌ వర్తించదు 

Mar 17 2019 2:58 AM | Updated on Mar 18 2019 9:02 PM

Complete basic level arrangements for the Lok Sabha elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపుల అంశం ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్‌) పరిధిలోకి రాదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ఇలా పార్టీలు ఫిరాయించడం ఉల్లంఘన పరిధిలోకి రాదా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఈఓ ఈ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడానికి ప్రాథమిక స్థాయి ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదల కానుందని, ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై శనివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రగతి భవన్‌లో రాజకీయ కార్యకలాపాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) పంపించామన్నారు. 

మన ఓటర్లు దాదాపు 3కోట్లు! 
గతనెల 22 (ఫిబ్రవరి)న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,95,18,954 మంది ఓటర్లున్నారని రజత్‌కుమార్‌ వెల్లడించారు. నిరంతర ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15 వరకు 3.38లక్షల కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈ దరఖాస్తులను పరిష్కరించి ఈ నెల 25న అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు. దీంతో ఏప్రిల్‌ 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయనున్న ఓటర్ల సంఖ్య 2.99/2.98 కోట్లకు చేరే అవకాశముందన్నారు. గత నెల 22న ప్రచురించిన ఓటర్ల జాబితాలో తొలిసారిగా చోటుదక్కించుకున్న కొత్త ఓటర్లకు ఈ నెల 25లోగా, ఈ నెల 25న ప్రచురించనున్న అనుబంధ ఓటర్ల జాబితాలో చోటు పొందనున్న కొత్త ఓటర్లకు వచ్చే నెల 5 నాటికి ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

మీ–సేవా కేంద్రాల్లో రూ.25 చెల్లించి పాత ఓటర్లు మాత్రం కొత్త నమూనా ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చన్నారు. ఓటరు గుర్తింపు కార్డు రుసుంను పెంచాలని మీ–సేవా యంత్రాంగం కోరినప్పటికీ లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనుమతించలేదన్నారు. లోక్‌సభ ఎన్నికలు జరిగే ఏప్రిల్‌ 11 వరకు రూ. 25కే ఈ కార్డులు జారీ చేయాలని ఆదేశించామన్నారు. ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని సైతం ఏప్రిల్‌ 5లోగా పూర్తి చేస్తామన్నారు. పంపిణీ జరగని ఫొటో గుర్తింపు కార్డులను సంబంధిత పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు అందుబాటులో ఉంచుతామన్నారు. 

తప్పుగా తొలగించింది 2.48లక్షల ఓట్లు 
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్దఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని వచ్చిన ఆరోపణలపై రజత్‌కుమార్‌ వివరణ ఇచ్చారు. కొన్ని ఫిర్యాదులను పరిశీలించగా ఆయా ఓటర్లను 2015లో నెర్పాప్‌ కార్యక్రమంలో భాగంగా కింద తొలగించినట్లు తేలిందన్నారు. నెర్పాప్‌ కింద తొలగించిన మొత్తం 35,13,370 ఓటర్ల విషయంలో పునర్విచారణ జరిపించామని, అందులో కేవలం 2.48లక్షల ఓటర్లను మాత్రమే తప్పుగా తొలగించినట్లు తేలిందని, మిగిలిన 33లక్షల ఓట్ల తొలగింపు సరైనదేనన్నారు.  

ఈవీఎంలు సిద్ధం.. 
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి పంపించిందని రజత్‌కుమార్‌ తెలిపారు. 54,953 బ్యాలెట్‌ యూనిట్లు, 40,038 కంట్రోల్‌ యూనిట్లు, 41,356 వీవీప్యాట్‌ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. 29 జిల్లాల్లో ఇప్పటికే ఈవీఎంల ప్రాథమిక స్థాయి తనిఖీలు పూర్తయ్యాయన్నారు. ఈవీఎంలను అన్ని రకాల ఫ్రీక్వెన్సీల దగ్గర బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్‌ సంస్థలు పరీక్షించి చూశాయని, వాటితో రిమోట్‌గా అనుసంధానం కావడం అసాధ్యమని తేలిందన్నారు. లోక్‌సభ ఎన్నికల విధుల్లో 43,801 ప్రిసైడింగ్‌ అధికారులు, అంతే సంఖ్యలో సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు, 88,806 మంది సహాయ పోలింగ్‌ సిబ్బంది, 9,541 సూక్ష్మ పరిశీలకులు కలిపి మొత్తం 1,85,560 మంది పాల్గొననున్నారని సీఈవో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement