కమలం.. సమరశంఖం

BJP Leader Amit Shah Tour In Telangana - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  ముందస్తు రూపంలో ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సమరశంఖం పూరిస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ఏకంగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా స్వయంగా శనివారం పాలమూరు బహిరంగసభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి ఉమ్మడి పాలమూరు నుంచి ఖచ్చితంగా కొన్ని స్థానాలు గెలుపొందాలనే పట్టుదలతో కమలం పార్టీ ఉంది. అందులో భాగంగా పార్టీకి సెంటిమెంట్‌గా కలిసొచ్చే పాలమూరు నుంచే జనంలోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బహిరంగసభ నిర్వహించి కార్యకర్తల్లో జోష్‌ నింపేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బలప్రదర్శనలో భాగంగా భారీ జనసమీకరణ చేసేందుకు ఉమ్మడి జిల్లాలో పలు సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు కేడర్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు.

గెలుపు బాధ్యత తీసుకున్న అమిత్‌షా 
ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో బీజేపీకి మొదటి నుంచి మంచి పట్టు ఉంది. అయినా కొన్ని చోట్ల సీట్లు సాధించలేకపోతుంది. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా కొన్ని సీట్లు గెలుపొందాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు అభ్యర్థుల గెలుపు బాధ్యతను అమిత్‌షా భుజాన వేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దేశ వ్యాప్తంగా ఎలాంటి పట్టులేని త్రిపుర వంటి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడంతో పాటు అస్సాం, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. అందుకు అనుగుణంగా తెలంగాణలో కూడా మెరుగైన ఫలితాలు సాధించేందుకు అమిత్‌ షా బృందం కొన్ని రోజులుగా అంతర్గత సర్వేలు చేపట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం.

గత ఎన్నికల సందర్భంగా ఏయే నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చాయి.. ఎక్కడెక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారు, ఏయే ప్రాంతాల్లో పార్టీకి పట్టు ఉంనే అంశాలపై సర్వే చేయించినట్లు సమాచారం. అలాగే పార్టీకి సానుభూతి ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని నాయకులను సైతం చేర్చుకోవాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే కొందరు నేతల జాబితాను సిద్ధం చేసుకున్న పార్టీ అధినాయకత్వం సదరు నేతలతో సంప్రదింపులు చేపట్టినట్లు సమాచారం. మొత్తం మీద రానున్న ఎన్నికల్లో కల్వకుర్తి, నారాయణపేట, వనపర్తి, మక్తల్, దేవరకద్ర, గద్వాల, నాగర్‌కర్నూల్, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ వంటి అసెంబ్లీ స్థానాలపై గట్టి ఫోకస్‌ పెట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సదరు నియోజకవర్గాల్లో కొన్నింటినైనా కైవసం చేసుకోవాలని అమిత్‌ షా మంత్రాంగం నడుపుతున్నారు.

సెంటిమెంట్‌పై ప్రధాన దృష్టి 
పాలమూరు ఉమ్మడి జిల్లాలో గతంలో బీజేపీకి గట్టి పట్టు ఉండేది. జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను గెలుపొందిన చరిత్ర ఉంది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌తో పాటు పలు అసెంబ్లీ స్థానాలను సైతం గెలుపొందింది. అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అసెంబ్లీ సీటు బీజేపీ కైవసం చేసుకుని రాష్ట్రంలోనే సంచలన విజయం నమోదు చేసింది. వీటితో పాటు భారీ సంఖ్యలో స్థానిక సంస్థల స్థానాలు గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అలాగే పట్టుభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. ఇలా మొత్తం మీద పాలమూరు ప్రాంతం సెంటిమెంట్‌గా బీజేపీకి కలిసిరావడంతో ఎన్నికల శంఖారావాన్ని కూడా ఇక్కడి నుంచే పూరిస్తోంది.
 
బలమైన నేతలు దూరం 
ఈ నాలుగేళ్ల కాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీకి బలమైన నేతలు దూరమయ్యారు. గత ఎన్నికల సందర్భంగా పార్టీకి మంచి ఊపు తీసుకొచ్చిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి వంటి నేతలు పార్టీని వీడారు. ప్రజా ఉద్యమాల విషయంలో బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తున్న ధోరణికి నిరసనగా పార్టీని వీడుతున్నట్లు వారు ప్రకటించారు. రాజకీయాల్లో అత్యంత సీనియర్‌నేతగా గుర్తింపు పొందిన నాగం జనార్ధన్‌రెడ్డి... సాగునీటి ప్రాజెక్టుల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలపై పోరు నడిపారు. ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం దోచిపెడుతోందంటూ ఆధారాలతో సహా న్యాయస్థానాలలో కేసులు వేయడంతో పాటు పార్టీ అధిష్టానం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. పార్టీ నుంచి స్పందన లేకపోవడంతో పాటు మద్దతు లభించకపోవడంతో పార్టీని వీడారు. ఇలా మొత్తం మీద బలమైన నేతలు పార్టీని వీడడంతో కేడర్‌లో కాస్త నిరుత్సాహం నెలకొంది.
 
లక్ష్యం.. లక్ష మంది 
సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరిస్తున్న బీజేపీ... భారీ బల ప్రదర్శనకు సిద్ధమైంది. మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్‌ కళాశాలలో శనివారం నిర్వహించనున్న బహిరంగసభకు దాదాపు లక్ష మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నుంచి భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనాన్ని తరలించే విషయంలో గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీలను అప్రమత్తం చేశారు. ఇలా మొత్తం మీద లక్ష మందితో సభ నిర్వహించడం ద్వారా మిగతా రాజకీయపార్టీలకు తమ బలం చూపించుకోవాలని భావిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top