‘కాంగ్రెస్‌లో నాయకత్వానికి కొదవలేదు’ | batti vikramarka slams trs government | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌లో నాయకత్వానికి కొదవలేదు’

Jul 13 2017 6:59 PM | Updated on Mar 18 2019 9:02 PM

‘కాంగ్రెస్‌లో నాయకత్వానికి కొదవలేదు’ - Sakshi

‘కాంగ్రెస్‌లో నాయకత్వానికి కొదవలేదు’

కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వానికి కొదవ లేదని తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వానికి కొదవ లేదని తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రులను ముందుగా ప్రకటించే ఆనవాయితీ తమ పార్టీలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. భట్టి విక్రమార్క గురువారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిపై ఎన్నారైలు అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను చూసి ఎన్నారైలు ఆశ్చర్యపోయారని తెలిపారు. ఎన్నారైలు తెలంగాణ సంపద అని వారి మేధస్సు రాష్ట్రానికి అవసరమని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రగతి శీలంగా, ప్రజాస్వామ్య హితంగా ఉండాలని ఎన్నారైలు కోరుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పాలన తెలంగాణకు నష్టమన్న అభిప్రాయంతో ఎన్నారైలు ఉన్నారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. నయీం డెన్, డబ్బులు, వజ్రాలు ఎటు పోయాయని ప్రశ్నించారు. నయీమ్ కేసులో వాస్తవాలను ఎందుకు బయటకు పెట్టడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. మియాపూర్ భూ కుంభకోణంలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఎన్నారై ఆసక్తి చూపారని వివరించారు.  త్వరలో తెలంగాణ ఎన్నారైలతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారని తెలిపారు.  అమెరికాలో ఎన్నారై సెల్‌ను బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.

అలాగే అనుబంధ సంఘాల పనితీరుపై సమీక్షిస్తామన్నారు. ఇక కోమటిరెడ్డి పాదయాత్ర ఆయన వ్యక్తిగతమని, దీనిపై పార్టీలో చర్చిస్తామన్నారు. కాంగ్రెస్‌కు స్వంత మీడియా ఉంటే బాగుంటుందనేది ఎన్నారైల అభిప్రాయమని, పార్టీ ముందుకు వస్తే.. మీడియా ఏర్పాటుకు ఫండ్స్ ఇస్తామన్నారని భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement