తక్షణమై సంజీవ్‌ కుటుంబాన్ని ఆదుకోవాలి : బండి సంజయ్‌

Bandi Sanjay Tributes To Ramagundam Singareni Workers Sajeev - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికారుల నిర్లక్ష్యం వల్లే సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్‌ మృతి చెందాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. శనివారం ఆయన సంజీవ్‌ పార్థివ పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంజీవ్‌ మృతిపై కేంద్రమంత్రికి, మైనింగ్‌ శాఖకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో అధికారులు ఒత్తిడి చేసి ఆయనను విధుల్లోకి పిలిచారని ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత అధికారులదే అన్నారు. మైనింగ్‌ రూల్స్‌ ప్రకారం శిక్షణ ఉన్న కార్మికులనే విధుల్లోకి తీసుకోవాలి కాని, ఎలాంటి అనుభవం లేని సంజీవ్‌ను ఎలా పనిలోకి తీసుకున్నారని ప్రశ్నించారు.
(చదవండి : కార్మికుడి అదృశ్యం.. విషాదాంతం)

కార్మికుల సంక్షేమం మరచి సంపాదననే ధ్యేయంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పిపోయి పదిరోజులు అయినా కార్మికుని ఆచూకి కనుక్కోలోని స్థితిలో ఉంటే కార్మికుల కుటుంబాలకు భరోసా ఎలా అంధిస్తారని ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే సంజీవ్‌ కుటుంబాన్ని ఆదుకొని, వారిలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు.

కాగా, ఈ నెల 7న సింగరేణి సంస్థ రామగుండం డివిజన్‌–1 పరిధిలోని జీడీకే–11గనిలోకి వెళ్లి అదృశ్యమైన సింగరేణి కార్మికుడు కొడెం సంజీవ్‌(58) .. 11 రోజుల గాలింపు తర్వాత జీడీకే–6ఏ గని ప్రాంతంలో 43వ లెవల్, 4 సీమ్, 1డీప్‌లో మృతిచెంది కన్పించాడు. మృతదేహాన్ని శుక్రవారం కుళ్లిపోయిన దశలో అధికారులు గుర్తించారు. గనిలో మొదటిషిప్టులో విధుల్లోకి వెళ్లిన సంజీవ్‌ ముందుగా కేటాయించిన పంపు వద్ద నీటిని క్లియర్‌చేసి, 1డీప్, 27వ లెవల్, 4వ సీమ్‌లో పంపు ఆపరేటర్‌గా పనులు చేపట్టాడు. విధుల అనంతరం బయటకు రావాల్సి ఉంది. ఈక్రమంలో దారి తప్పి మూసివేసిన జీడీకే–6ఏగని వైపు సీమ్‌లోకి గాలిలేని ప్రాంతానికి వెళ్లి ఊపిరాడక మృతిచెందాడని అధికారులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top