మరో మూడు కొత్త పురపాలికలు | Sakshi
Sakshi News home page

మరో మూడు కొత్త పురపాలికలు

Published Sun, Sep 23 2018 1:20 AM

Another Three New Muncipalities In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో మూడు కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. గిరిజన ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, ఆసిఫాబాద్, సారపాకలను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అనుమతులు కోరుతూ గవర్నర్‌ నరసింహన్‌ కార్యాలయానికి కొన్ని నెలలకిందట పురపాలక శాఖ పంపిన ప్రతిపాదనలకు కదలిక వచ్చింది. ఈ ప్రతిపాదనలపై తాజాగా గవర్నర్‌ కార్యాలయం వివరణలను కోరింది. గవర్నర్‌ కార్యాలయం నుంచి అనుమతులు వస్తే ఈ ప్రాంతాలను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయని పురపాలక శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి. 173 గ్రామ పంచాయతీల విలీనంతో రాష్ట్రంలో 68 పురపాలికలను ఏర్పాటుచేస్తూ గత మార్చిలో ప్రభుత్వం శాసనసభలో రాష్ట్ర మునిసిపాలిటీల చట్టం, మున్సిపల్‌ కార్పొరేషన్ల చట్టం, జీహెచ్‌ఎంసీ చట్టాలకు సవరణలు జరిపిన విషయం తెలిసిందే.

అప్పుడే ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, ఆసిఫాబాద్, సరపాకలతో పాటు ఉట్నూరును సైతం మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. షెడ్యూల్డ్‌ ఏరియా పరిధిలో ఈ నాలుగు ప్రాంతాలు ఉండడంతో మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ అనుమతి తప్పనిసరిగా మారింది. గవర్నర్‌ కార్యాలయం నుంచి అనుమతులు లభించకపోవడంతో అప్పట్లో 68 కొత్త మునిసిపాలిటీల ఏర్పాటుతో ప్రభుత్వం సరిపెట్టుకుంది. ఆ తర్వాత ఉట్నూరు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గవర్నర్‌ కార్యాలయం నుంచి అనుమతులు లభించిన తర్వాత భద్రాచలం, ఆసిఫాబాద్, సరపాకలను మునిసిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించనుంది.   

Advertisement
Advertisement