
సాక్షి, దహెగాం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని తండ్రి కక్ష పెంచుకున్నాడు. కోడలితో కలిసి అత్తారింటి వద్దే కొడుకు ఉండడాన్ని జీర్ణించుకోలేక కోడలిని హతమార్చాలని పన్నాగం పన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తలాండి శ్రావణి (22), శివార్ల శేఖర్ ప్రేమించుకుని గతేడాది కులాంతర వివాహం చేసుకున్నారు. శేఖర్ తండ్రి సత్తయ్య అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. భార్య శ్రావణి ఉరఫ్ రాణితో కలిసి శేఖర్ అత్తారింటి వద్దే ఉంటున్నాడు. శనివారం శేఖర్ తన అత్తామామలు చెన్నయ్య, అనూషతో కలిసి వంట చెరుకు తీసుకురావడానికి గ్రామ సమీపంలోని అడవికి వెళ్లాడు. గర్భిణి అయిన శ్రావణి ఇంట్లో ఒంటరిగా ఉంది. సత్తయ్య గొడ్డలితో ఇంట్లోకి చొరబడి శ్రావణిపై దాడి చేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నంలో బయటకు పరుగులు తీసినా వెంబడించి దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సత్తయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.