
ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఎస్పీవీ ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు
పీపీపీ, ఈపీసీ, హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఆ ప్రాజెక్టులు కాంట్రాక్టర్లకు అప్పగింత
కాంట్రాక్టర్లకు నేరుగా భూముల కేటాయింపు..
ఆ భూములు తనఖా పెట్టి అప్పులు తెచ్చుకునే వెసులుబాటు
పన్నులు, యూజర్ చార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయనున్న కాంట్రాక్టర్
అప్పటికీ ఆ ప్రాజెక్టులో నష్టం వస్తే వీజీఎఫ్ కింద నిధులు ఇవ్వనున్న సర్కార్
ప్రత్యేక ప్రాజెక్టులను సన్నిహితులకు కట్టబెట్టి ‘నీకింత.. నాకింత..’ అని పంచుకోవడానికి ముఖ్యనేత ఎత్తులు
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం ముసుగులో మరో దోపిడీకి ముఖ్యనేత స్కెచ్ వేశారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ బ్రిడ్జి, స్పోర్ట్స్ సిటీ, రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, రోప్‌వే, ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్‌ఆర్)తోపాటు ఎప్పటికప్పుడు గుర్తించే ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టడానికి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ని ఏర్పాటుచేస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ), ఎస్పీవీ సిఫార్సుల ఆధారంగా ప్రత్యేక ప్రాజెక్టులను చేపడతారు. ఆ ప్రాజెక్టులకు పీపీపీ, హైబ్రీడ్ యాన్యుటీ, ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతుల్లో టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఆ కాంట్రాక్టర్లతో సీఆర్‌డీఏ, ప్రభుత్వం, ఎస్పీవీ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటాయి.
భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని పనులు
రాజధానిలో ప్రత్యేక ప్రాజెక్టుల పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లకు నేరుగా భూములు కేటాయిస్తారు. ఆ భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకోవడానికి కాంట్రాక్టర్‌కు హక్కులు కల్పిస్తారు. ఆ ప్రాజెక్టుల ద్వారా పన్నులు, యూజర్ చార్జీల రూపంలో వచ్చే ఆదాయంలో వాటా (రెవెన్యూ షేరింగ్) వంటి అంశాలను సీఆర్‌డీఏ ఖరారు చేస్తుంది. అప్పటికీ ఆ ప్రాజెక్టుల్లో నష్టం వస్తే వయబులిటీ గ్యాప్ ఫండ్(వీజీఎఫ్) కింద కాంట్రాక్టర్లకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది.
వీటిని పరిశీలిస్తే.. ప్రత్యేక ప్రాజెక్టులను సన్నిహితులకు కట్టబెట్టి భారీ ఎత్తున భూములు కేటాయించి.. వాటిని తనఖా పెట్టి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చే అప్పులతో వాటిని చేపట్టి ‘నీకింత... నాకింత’ అంటూ దోచుకోవడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఈ ప్రాజెక్టుల కోసమే ప్రభుత్వం రాజధానిలో మలి విడత భూసమీకరణకు సిద్ధమైందన్నది స్పష్టమవుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటి వాటి కోసం భూములు అవసరమని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పదేపదే చెబుతుండటం విదితమే.
రాజధాని భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ సర్కార్ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాజధానిలో భూసమీకరణ పథకం(ల్యాండ్ పూలింగ్ స్కీం) కింద భూములు ఇవ్వని రైతుల నుంచి భూములను సేకరించే ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 343.36 ఎకరాల భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్‌లో చట్టపరమైన లోపాలు ఉండటంతో దాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లు(53,749.49) ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిలో 15,807.91 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 37,941.58 ఎకరాలు రైతులది. భూసమీకరణ పథకం కింద 34,396.87 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. మరో 3,544.71 ఎకరాలను సమీకరణ కింద ఇచ్చేందుకు రైతులు అంగీకరించలేదు. ఇప్పుడు ఆ భూములను సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.