
10, 11న కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో పర్యటన
13న గద్వాల నియోజకవర్గంలో ర్యాలీ, బహిరంగ సభ
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జిల్లాల పర్యటనకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీ రామారావు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దిశగా పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయడంపైనా దృష్టి పెట్టనున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ని యోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేలా కార్యక్రమాలను చేప ట్టనున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెం, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు.
13న గద్వాల నియోజకవర్గంలో జరిగే ర్యాలీ, బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారు. సుమారు వారం రోజులుగా ఎర్రవల్లి నివాసంలోనే ఉంటున్న కేటీఆర్.. కేసీఆర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన సోదరి, ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడంతో పార్టీలో నెలకొన్న గంద రగోళానికి తెరపడిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న ఎన్నికలపై కేటీఆర్ దృష్టి కేంద్రీకరించారు.
దసరా పండుగ లోపు వీలైనన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నియోజకవర్గాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు లక్ష్యంగా ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తల చేరికల వ్యూహానికి పదును పెడుతున్నారు. కాగా, ఈ నెల 13న గద్వాల పర్యటనలో మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.
ఎర్రవల్లి నివాసానికి నేతల క్యూ..
సీనియర్ నేత హరీశ్‌రావు లక్ష్యంగా ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేసిన నేప థ్యంలో శనివారం మధ్యాహ్నం కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. లండన్ నుంచి తిరిగివచ్చిన హరీశ్‌రావు కూడా వెళ్లారు. ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తదితరులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. వారంతా కేసీఆర్‌ను కూడా కలిసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. కేసీఆర్‌ను హరీశ్‌రావు మర్యాదపూర్వకంగానే కలిశారని, ఈ భేటీలో ఎమ్మెల్సీ కవిత అంశం ప్రస్తావనకు రాలేదని తెలిసింది.