బాల్య వివాహాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు అడ్డుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అంగన్‌వాడీలు
Aug 29 2017 4:47 PM | Updated on Jun 2 2018 8:32 PM
ఖమ్మం: ఓ బాల్య వివాహాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు అడ్డుకున్న సంఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని తిరుమలకుంట కాలనీలో చోటుచేసుకుంది. పదిహేనేళ్ల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి 20 గొత్తికోయల కుటుంబాలు ఈ కాలనీకి వలస వచ్చాయి. వీరిలో ఓ కుటుంబానికి చెందిన 6వ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల చిన్నారికి పెళ్లి చేసేందుకు నిశ్చయించారు.
ముహూర్తాలు పెట్టుకోవడంతో మంగళవారం ఉదయం వివాహానికి చర్ల మండలంలోని క్రాంతిపురం గ్రామానికి చెందిన మగ పెళ్లివారు, అతని బంధువులు తరలివచ్చారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తలు శ్రీనివాసమ్మ, వాణి, సత్యవతిలు అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు.
చిన్న వయస్సులో పెళ్లి చేయకూడదని ఇరు కుటుంబాల వారికి అవగాహన కల్పిస్తుండగా వారు వాగ్వాదానికి దిగారు. దాంతో అంగన్‌వాడీ కార్యకర్తలు స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్తులకు సమాచారం అందించగా వారంతా అక్కడి చేరుకున్నారు. 18 ఏళ్లు నిండకుండా పెళ్లి చేస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో పెళ్లి నిలిపివేశారు. అనంతరం బాలిక తల్లిదండ్రులకు అంగన్‌వాడీ కార్యకర్తలు మరోసారి అవగాహన కల్పించి చిన్నారిని ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించి చదువు చెప్పిస్తామనగా తల్లిదండ్రులు అంగీకరించారు.
Advertisement


