సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు కనీసవేతనం రూ. 26 వేలతో పాటు పెన్షన్, వైద్యసదుపాయం కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు ఆందోళనకు దిగారు. ఈ రోజు (శుక్రవారం) జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిరసనలు చేపట్టారు. విశాఖ జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రకటించిన విధంగా జీతాన్ని వెంటనే పెంచి కార్యకర్తలపై రాజకీయ వేధింపులను ఆపాలని కోరారు. ప్రస్తుతం వాడుతున్న నవచేతన యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన చేపట్టారు.సీ.ఐ.టీ.యు నేత కందారపు మురళి నేతృత్వంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాది మంది అంగన్వాడి వర్కర్లు తో రిలే నిరాహారదీక్ష చేపట్టారు.అంగన్వాడి వర్కర్ లకు ఈ.ఎస్. ఐ, పి.ఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలు అంగన్వాడి వర్కర్ లకు అందించాలన్నారు.
కాగా ప్రభుత్వం అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలతో పాటు పెన్షన్, PF, ESI సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టారు. పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు సేవలంధిస్తున్నారని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలకు పిలుపిచ్చారు.ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు, 48,770 మినీ కేంద్రాలు ఉన్నాయి.
ప్రధాన డిమాండ్లు
● సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగన్‌వాడీలకు రూ.26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలు కల్పించాలి.
● అంగన్‌వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయడంతో పాటు, గుజరాత్ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జీతాలు పెంచాలి.
● మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్‌కు 5 ఏళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలి.
● అంగన్‌వాడీలకు ‘తల్లికి వందనం’ సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.
● సిగ్నల్ సమస్యలతో తీవ్ర ఇబ్బంది పెడుతున్న ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్) ఫేస్ యాప్‌ను, పనిభారం పెంచే నవచేతన యాప్‌ను తక్షణమే రద్దు చేయాలి. పెండింగ్‌లో ఉన్న టీఏ, మెయింటినెన్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి.


