ఫైట్‌ ‘అనిమియా’

Anemia Disease Medical Test In Adilabad Govt Schools - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: రక్తహీనత సమస్యను అధిగమించడానికి వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఫైట్‌ అనిమియా పేరుతో పిల్లల్లో, గర్భిణుల్లో రక్తహీనతను తగ్గించేందుకు కార్యక్రమ రూపకల్పన చేస్తోంది. జిల్లాలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉండడంతో అనిమియాకు గురై మత్యువాత పడుతున్న సంఘటనలు అనేకం. చిన్నారులు పౌష్టికాహార లోపం కారణంగా వచ్చే అనిమియాతో ఆస్పత్రుల పాలవుతున్నారు. పౌష్టికాహార కేంద్రాలు ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అనిమియాను తరమికొట్టేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.

విద్యార్థులకు వైద్య పరీక్షలు..
జిల్లాలోని 300 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, వసతిగృహాల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే వైద్య పరీక్షలు చేసి రక్తహీనత విషయాన్ని నిర్ధారిస్తారు. జిల్లా వ్యాప్తంగా 110 యూపీఎస్, 190 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎయిడెడ్‌ పాఠశాల 1, బీసీ వసతి గృహాలు 2, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 22, కేజీబీవీలు 17, లోకల్‌బాడి పాఠశాలలు 187, సోషల్‌ వెల్ఫేర్‌ 3, మోడల్‌ స్కూళ్లు 6, ట్రైబల్‌ వెల్ఫేర్‌ 53, యూఆర్‌ఎస్‌ 1, రెసిడెన్షియల్‌ పాఠశాలలు 6 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కలిపి 43,991 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికి వైద్య పరీక్షలు చేయనున్నారు.

ఈనెల 12 నుంచి మొదలు..
ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలల్లో అనిమియా వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ 8 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు ఏఎన్‌ఎంలు, ఒక వైద్యాధికారి, ఒక ఫార్మాసిస్ట్‌ ఉంటారు. వైద్య  పరీక్షలు చేసిన తర్వాత హెమోగ్లోబిన్‌ శాతం 8 గ్రాములు ఉంటే రోజుకు రెండు ఐరన్‌ మాత్రలు, 8 నుంచి 11 శాతం ఉంటే రోజు ఒక మాత్ర చొప్పున మూడు నెలల పాటు అందిస్తారు. పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నారో లెక్కించి వారికి చికిత్స కోసం చర్యలు తీసుకుంటారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం అనంతరం ఈ మాత్రలు వారికి ఇవ్వనున్నారు.

పౌష్టికాహారం లోపమే సమస్య..
పౌష్టికాహార లోపమే అనిమియా రావడానికి ప్రధాన కారణం. ప్రొటీన్లు, విటమిన్లు, ఆకుకూరలు, కూరగాయల భోజనం చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. అనిమియాతో విద్యార్థుల్లో అలసట రావడం, తల తిరగడం, ఛాతినొప్పి రావడం, పెరుగుదల లేకపోవడం, ఆకలి ఉండకపోవడం, తదితర వాటితో బాధపడుతుంటారు. దీంతో విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలను ఎంపిక చేయగా, అందులో ఆదిలాబాద్‌ జిల్లా ఉంది. జిల్లాలో దాదాపు 30 శాతం మంది వరకూ విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు 
ఫైట్‌ అనిమియా పేరుతో రక్తహీనతతో బాధపడుతున్న 6 నుంచి 10వ తరగతి విద్యార్థులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేయిస్తాం. రక్తహీనతతో బాధపడుతున్న వారికి మాత్రలు అందిస్తాం. జిల్లా వ్యాప్తంగా 43,991 మంది విద్యార్థులు ఉండగా వారందరికి పరీక్షలు చేస్తాం. అనిమియాతో బాధపడుతున్న వారికి మూడు నెలల పాటు మాత్రలు అందిస్తాం. – రాజీవ్‌రాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఆదిలాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top