‘యాదాద్రి’ ప్లాంటుపై పునర్విచారణ! | Yadadri thermal power plant again rereferendum | Sakshi
Sakshi News home page

‘యాదాద్రి’ ప్లాంటుపై పునర్విచారణ!

Oct 17 2016 3:08 AM | Updated on Mar 28 2019 6:26 PM

‘యాదాద్రి’ ప్లాంటుపై పునర్విచారణ! - Sakshi

‘యాదాద్రి’ ప్లాంటుపై పునర్విచారణ!

అధికారుల తప్పిదాలతో యాదాద్రి ప్లాంట్ నిర్మాణంలో మరింత ఆలస్యం జరుగుతోంది.

జెన్‌కోకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశం
పర్యావరణ అనుమతుల జారీపై నిర్ణయం వాయిదా

సాక్షి, హైదరాబాద్:
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) నిర్మించ తలపెట్టిన 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మళ్లీ బహిరంగ విచారణ నిర్వహించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించి జెన్‌కో రూపొందిన ‘పర్యావరణ ప్రభావంపై అంచనా (ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్/ ఈఐఏ)’ నివేదికలో తీవ్ర లోపాలుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త ఈఐఏ నివేదికను రూపొందించాలని, దాని ఆధారంగా ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మరోమారు బహిరంగ విచారణ నిర్వహించాలని స్పష్టం చేసింది. గత ఆగస్టు 29న జరిగిన ‘పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ)’ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులపై తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు సమావేశానికి సంబంధించిన మినిట్స్ కాపీని సవరించి మళ్లీ విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినిట్స్‌లో బహిరంగ విచారణ నిర్ణయాన్ని పొందుపరచలేదు. ఈ నేపథ్యంలో తాజాగా చేర్చి సవరించిన మినిట్స్ కాపీని విడుదల చేసింది.
 
కాపీ పేస్ట్ నివేదిక
ఇతర ప్రాజెక్టుల నివేదికల నుంచి సమాచారాన్ని తస్కరించి (కాపీ పేస్ట్) ఈ నివేదికను జెన్‌కో రూపొందించిందని, ప్రాజెక్టుకు సంబంధం లేని ఎన్నో అంశాలను ఈ నివేదికలో చొప్పించినట్లు నిపుణుల కమిటీ నిర్ధారించింది.

కథ మళ్లీ మొదటికి
కమిటీ అక్షింతల నేపథ్యంలో జెన్‌కో కొత్తగా ఈఐఏ నివేదిక రూపొందించి దాని ఆధారంగా బహిరంగ విచారణ నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల కోసం జెన్‌కో చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అధికారుల తప్పిదాలతో ప్లాంట్ నిర్మాణంలో మరింత ఆలస్యం జరుగుతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement