ప్రభుత్వాస్పత్రిలో దారుణం | Toddler-selling in vellore goverment hosiptal | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రిలో దారుణం

Aug 23 2013 4:53 AM | Updated on Sep 1 2017 10:01 PM

ఆంబూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. రెండు రోజులు కిందట జన్మించిన చిన్నారిని కన్నతల్లే విక్రయించేందుకు యత్నించింది.

వేలూరు, న్యూస్‌లైన్: ఆంబూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. రెండు రోజులు కిందట జన్మించిన చిన్నారిని కన్నతల్లే విక్రయించేందుకు యత్నించింది.  వేలూరు జిల్లా ఆంబూరు తిరువళ్లువర్ నగర్‌కు చెందిన రవి భార్య లత ఆంబూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. వివాదం కారణంగా లత భర్త రవిని విడిచి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో చిన్నారిని పెంచడం కష్టంగా భావించింది. పసిబిడ్డను రూ. 10 వేలకు విక్రయించేందుకు యత్నించింది. ఇదే సమయంలో  వాణియంబాడికి చెందిన ముత్తప్ప, సరస్వతి దంపతులకు పిల్లలు లేక పోవడంతో ఆసుపత్రిలోని మగబిడ్డను కొనుగోలు చేసేందుకు వచ్చారు.  బ్రోకర్ల సాయంతో బేరం కుదుర్చుకున్నారు. 
 
వారు బ్రోకర్లకు రూ. 50 వేలు చెల్లించారు.  తల్లి లతకు రూ. 10 వేలు ఇచ్చి మిగిలిన వాటిని బ్రోకర్‌లు పంచుకునేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. బ్రోకర్లు వాటా ఇచ్చేందుకు  నిరాకరించడంతో ఆసుపత్రి సిబ్బంది ఆంబూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ముత్తప్ప, సరస్వతి న్యాయవాదితో కలిసి రూ. 20 బాండు పేపర్ ను తీసుకొచ్చిలత వద్ద సంతకం చేసుకొన్నారు. 
 
ఆంబూరు పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారిని విక్రయించేందుకు ప్రయత్నించిన తల్లి లత, కొనుగోలు చేసేందుకు వచ్చిన సరస్వతి, ముత్తప్పలను అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బ్రోకర్లు పరారయ్యారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్రోకర్లు అరెస్టయితే ఎంతకాలంగా ఈ తంతంగం సాగుతోంది? ఎంత మంది చిన్నారులను విక్రయించారు? అనే విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement