ఆంగ్లం మాకొద్దని తమిళ సంఘాల నిరసన | Tamil unions protest | Sakshi
Sakshi News home page

ఆంగ్లం మాకొద్దని తమిళ సంఘాల నిరసన

Published Thu, Aug 8 2013 2:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

Tamil unions protest

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల తరగతులకు వ్యతిరేకంగా తమిళ సంఘాలు గళం విప్పాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయ ముట్టడికి బుధవారం యత్నించాయి. పలువురి ని పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 సాక్షి, చెన్నై: నిర్బంధ విద్యా విధానం పేరుతో గత డీఎంకే ప్రభుత్వం విద్యా వ్యవస్థను తమిళమయం చేసింది. ఈ నిర్ణయం ఇతర భాషల విద్యార్థుల మీద తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత విద్యా వ్యవస్థలో ఆంగ్లానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రరుువేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆంగ్ల తరగతుల సంఖ్య పెంచేందుకు సిద్ధమయ్యూరు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో ఆంగ్లం తప్పని సరిచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అరుుతే విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో తమిళం, ఆంగ్లంలో పరీక్షలు రాసుకునేందుకు అనుమతిచ్చారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలల్లో ఆంగ్ల తరగతుల సంఖ్య పెంచే పనిలో పడ్డారు. ఈ పనులను విద్యాశాఖ వేగవంతం చేయడంతో తమిళాభిమాన సంఘాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం సచివాలయ ముట్టడికి నిర్ణయించాయి.
 
 సచివాలయ ముట్టడి యత్నం
 తమిళాభిమాన సంఘాలు, తమిళాభిమాన రాజకీయ పార్టీల నేతృత్వంలో బుధవారం ఉదయం చెన్నైలోని మన్రో విగ్రహం వద్ద తమిళ ప్రేమికులు గుమిగూడారు. ఆంగ్లం వద్దు, తమిళమే ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. సంఘాలు, ఎండీఎంకే, తమిళర్ వాల్ ఉరిమై కట్చి నేతలు హనీఫా, మణి అరసన్, మల్లై సత్య, వేల్ మురుగన్, వేణుగోపాల్ మాట్లాడారు. మాతృభాష మీద ప్రభావం చూపించే విధంగా ప్రభుత్వం ఆంగ్లానికి పెద్దపీట వేస్తోందని ధ్వజమెత్తారు. తమిళ విద్యా విధానాన్ని పట్టించుకోకుండా ఆంగ్లానికి కోట్లు వెచ్చించడం బాధాకరమన్నారు. 
 
 ఆంగ్ల తరగతుల ఏర్పాటు ప్రక్రియ ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం తమిళాభిమానులు ర్యాలీగా సచివాలయం వైపు దూసుకెళ్లారు. వీరి ర్యాలీకి అనుమతి లేని దృష్ట్యా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుంటూ ముందుకెళ్లేందుకు యత్నించిన తమిళాభిమానుల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట, వాగ్యుద్ధం చోటు చేసుకుంది. నిరసనకారులు రాస్తారోకోకు దిగారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చివరకు అందరినీ అరెస్టు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
 

Advertisement
Advertisement
Advertisement