
మాట్లాడుతున్న సైన్స్ సూపర్ వైజర్, డీఈఓ తదితరులు
కొరాపుట్ : విద్యార్థుల సృజనాత్మక శక్తి విజ్ఞాన ప్రదర్శనల ద్వారా వ్యక్తమవుతుందని జిల్లా విద్యాధికారి మర్కట కేసరి రాయ్ అన్నారు. జిల్లా విద్యావిభాగం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏర్పాటు చేసిన కొన్ని విజ్ఞాన ప్రదర్శనలు ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార సూచనలుగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రతి విద్యార్థి విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొనే విధంగా అందరి విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా సైన్స్ సూపర్‌వైజర్ శివ పట్నాయక్ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో పోటీపడిన 382 ప్రాజెక్టులలో 42 ప్రాజెక్టులను పోటీలో పాల్గొనేందుకు ఎంపిక చేసి ప్రదర్శనకు ఆహ్వానించినట్లు చెప్పారు. వాటిలో 34 ప్రాజెక్టులు ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొన్న వాటిల్లో 4 ప్రాజెక్టులను ఎంపిక చేసి భువనేశ్వర్‌లో రాష్ట్రస్థాయిలో ఈ నెల 12,13 తేదీలలో జరగనున్న విజ్ఞాన ప్రదర్శనలకు పంపనున్నామన్నారు. కార్యక్రమంలో సునాబెడ ఏఈఎఫ్ కళాశాల అధ్యాపకుడు ఉదయనాథ్ సామల్, కొరాపుట్ కళాశాల అధ్యాపకులు దీపక్ పట్నాయక్, తపన్ కుమార్ బెహర, కొరాపుట్ ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వికాస్‌చంద్ర సర్కార్ పాల్గొన్నారు.